Feeds:
టపాలు
వ్యాఖ్యలు

Posts Tagged ‘తెలుగు’

దొంగ చూపుల గాలాలేసి
గుండెకు గాయాలు చేసి
చల్లగా నవ్వింది
నవ యవ్వనాల జవ్వని

హృదయం కబళించి
కలల అలలు సృష్టించి
మనసుకు చిద్రం చేసింది
ప్రేమనే మహాసముద్రం

కళ్ళతో నవ్వుతూ
గుండెలో మంట పెడుతూ
మాడిపోయే క్షణాన
చిరుజల్లై కురిసింది కన్నీరు

Read Full Post »

 

వెలుగుపై చీకటి దాడి చేస్తున్న వేల
నిశీధి కలలు రెక్క విచ్చుకుంటున్నాయి
అనంత కోటి నక్షత్రాలు ఆకాశంలో మెరుస్తూ
వెలుగునంతటినీ నా ప్రేయసిపై కురిపిస్తున్నాయి

ప్రతి రోజు నిద్రకు ముందు నీ గురించి ఆలోచిస్తాను
కానీ.. నా స్వప్న లోకంలో నువెప్పుడూ కలవటం లేదు
ఏమో ఈనాటి రాత్రయినా అదృష్టం వరిస్తుందేమో
ఆ ఆనందాన్నంతటినీ ఒడిసి పట్టుకుంటాను

నేను అదృష్టవంతున్నయితే ఈ రేయంతా మనదే
పోనీ ఓ క్షణమైనా చాలు
నువ్విచ్చే తీయటి ముద్దులకు
నా సర్వస్వాన్నీ నీకు దాసోహం చేస్తాను

నా గుండెలో అనంతమైన ప్రేమ ఉంది
ఈ ప్రపంచంలో ఎవరితోను పంచుకోలేను
మృదువైన నీ శరీరం నా పక్కనే ఉన్న అనుభూతి
తక్కినవన్నీ తుచ్చమైపోతున్న భావన

వేడి నిట్టూర్పుల సెగలు చుట్టేస్తున్నాయి
మనిద్దరం వలపు వానలో తడుస్తున్నాం
నేనెప్పుడూ ఊహించలేదు
మనం స్వర్గాన్ని కనిపెడతామని

ఏమో…
ఏదో ఒకరోజు…
నా కల నిజమవుతుందేమో
అప్పటి వరకు నేను నిన్ను ప్రేమిస్తూనె ఉంటాను.

Read Full Post »

నా కలల నిండా
అందమైన ప్రవాహం
మెరుపై కనిపిస్తుంది

ప్రేమ నిండిన చూపులు
మస్తిష్కాన్ని బద్దలు కొట్టి
నన్నల్లుకుంటున్నాయి

నా హృదయం నిండా
ప్రియమైన స్పర్షానుభూతి
స్మరణకు వస్తోంది

అందమైన దేవత
తన నవ్వుతో
నా మనసుకు గాలాలేస్తోంది

సెలయేటిని తలపించే మరీచికా
చూపుల గాలాలేసే జవ్వని
రెండూ ఒకటే
ఏ దాహమూ తీరదు.

Read Full Post »

జీవితం ఒక చదరంగం
రాత్రి పగళ్ళు నలుపు తెలుపు గళ్ళు
ఆడుతున్నది యముడు విధాత
మనుషులే పావులు
ఎత్తులపై ఎత్తులు వేస్తూ
పావుల్ని జరుపుతూ
చంపి ఒక్కో పావును
తమ పెట్టెలో పడేసుకుంటున్నారు

Read Full Post »

నేనింకా నీ పిలుపు వినలేదు

రోజులు గంటల్లా గడుస్తున్నాయి
నా మనో ధైర్యం సడలి పోతోంది
ఏడవడానికి కూడా ధైర్యం లేదు
నా దగ్గర నీవు లేని
చల్లనైన నిశి రాతృలు నిర్వీర్యం అవుతున్నాయి

కొన్ని రాతృలు ఆకాశంలోకి చూస్తూ
నీ గురించి ఆలోచిస్తూ
నన్ను నేను ప్రశ్నించుకుంటాను
నిన్ను ఎందుకు ప్రేమించానని
అంతలోనే పెదవులపై చిరునవ్వు
దొరికిన కారణాలు దిగ్దిగంతాలు సాగాయి

నీ గొంతు గుసగుసలు

నులివెచ్చని నీ స్పర్ష
అందమైన నీ నవ్వు
గమకాల నీ నడక
ఉరకలెత్తే నీ పయ్యెద
ఏమని చెప్పను మైళ్ళ కొద్దీ సాగిన కారణాల్ని
తొలకరికి పులకరించే పుడమిలా
నీ తనూ రేఖల్లో
మమేకమవ్వాలని ఎదురుచూస్తున్నా.

Read Full Post »

ఏమిటా చూపులు..
ఇదే ఆఖరుసారన్నట్లుగా..
అపుడే పుట్టిన పసిబిడ్డను
చూస్తున్నంత అపురూపంగా
అసంకల్పితంగా చూసిన నాకు
నీ చూపుల తాకిడి ఉప్పెనలా తాకింది
నీ చూపుల తూటాలు
నాలో ఆశల్ని రేకెత్తించాయి
నీ కనురెప్పల మాటున ఆనందాన్ని నింపుకుని
నాలో పెను మంటలు రేపి
నన్నొంటరిని చేశావు
జీవిత గమనంలో
ఓ క్షణమేదో తలుక్కుమంటోంది
ఙ్ఞాపకాల పుటని తిరగేస్తే
ఆ క్షణమే
హృదయంలో చిరునవ్వుని
బాధల్నీ నింపేస్తుంది
ఎవరికి చెప్పను?
జన్మ జన్మల సంబంధాన్ని
ఆ కళ్ళు నాకు గుర్తు చేస్తున్నాయని
ఎలా చెప్పను?
అర్థం చెప్పుకోలేని అవ్యక్త భావంలా
ఆ చూపులు నన్నేదో ప్రశ్నిస్తున్నాయని
ఇవే రోజులు…
ఇవే క్షణాలు…
సాయంత్రాలు సంతోషాన్ని మోసుకొచ్చేవి
మనసు మధుర్యాల్ని వెదజల్లేది
మనిద్దరి చూపులు కలిసిన చోట
మట్టి రేణువులు సైతం మల్లెలై విరిసేవి
గాలి తరగలు గాంధర్వాల్ని ఆలపించేవి
క్షణాలు మాటల వనాలై మత్తుగా ఊగేవి
ఆశలు కిరణాలై హృదయాన్ని ఆవహించేవి
నీ కళ్ళు…
నా హృదయాన్ని ఊయలలూగించి
నన్ను వెంటాడుతున్నాయి
ఒంటరిగా…
అంతులేని ప్రశ్నలతో రాత్రులు మేలుకుని
ప్రతీక్షణాన్ని పరిశీలిస్తాను
ఇద్దరికీ మధ్య భౌతికంగా దూరం
మౌనంలోనే..
మోయలేని సంకేతాలని గ్రహించే మనసుకి
ఏ నిర్వచనాన్ని అందించను
నాకెప్పటికీ అర్థం కాదు
నీ ఙ్ఞాపకాలు నా మనసునెందుకిలా బాధిస్తాయో
నువు చెప్పవూ…

Read Full Post »

 

ఏమైంది నాకీ రోజు
మనస్సుపదే పదే వేగిర పడుతోంది
అదేం ఖర్మో…
ఇంకా తెలవారదేం!
రెండు వందల మైళ్ళ దూరం
అలవాటు లేని ప్రయాణం…
అలసిన శరీరం నిదురమత్తులోకి జారదేం?
ఓహ్…
నిన్ను చూడాలనే ఆరాటంతో
కునుకు రావడం లేదనుకుంటా!
నిదుర మత్తులో ఈ నగరం
పసిపాప మోములా ప్రశాంతంగా ఉంది
అక్కడక్కడ వినిపించే చిమ్మెటల సవ్వడి
అప్పుడప్పుడు వినిపించే గుడ్లగూబ అరుపులు
ఇవి తప్ప అంతా ప్రశాంతమే
మరో అలికిడైనా లేని వేళ
నా రాక నీకు తెలిసేదెలా?
ఆకసాన చందమామనై,
చందాంశు కిరణాలను
నా చూపుగా మలచి,
సగం తెరచిన కిటికీ గుండా నిన్ను చూడాలని…
నీకూ నాకూ మధ్య దూరాన్ని
పిల్ల తెమ్మరనై చెరిపెయ్యాలని…
ఎగసి పడే నీ కురులని
అలవోకగా సరి చేయాలని…
వేకువలో వేగు చుక్కనై
నీ వాకిటి ముందు వాలాలని…
నీలి మబ్బుల గొడుగు కింద
నిదుర మత్తుని పులుముకుని
ఒళ్ళు విరుచుకుంటూ మంచం దిగే నిన్ను
చూడాలని ఒకటే ఆరాటం…
తొలి సంధ్య వేళ
వాకిట కళ్ళాపు చల్లి,
అణువణువూ మమేకమైపోతూ,
నాజూకు వేల్ల మధ్య నుండి
తెల్లని ముగ్గు ధారల్ని పోస్తూ,
తుంటరి గాలి చేసే అల్లరికి
అలలా కదిలే ముంగురులని
పైకి ఎగదోసినప్పుడు…
నీ నుదుటిపై అంటుకున్న ముగ్గుని
నా అర చేత తుడవాలని…
అభ్యంగన స్నానం చేసి
ఆరుబయట తలారబెట్టుకుంటూ
అద్దం ముందు మెరుగులు దిద్దుకునే
నీ పక్కన చేరి…
అల్లరి చేయాలని
మనసంతా ఒకటే ఆరాటం.
ఇప్పుడు…
వేకువ ఝాము కళ్ళాపులెక్కడ
ముని వాకిట ముత్యాల ముగ్గులెక్కడ
ఏసీలు వచ్చాక తెరచిన కిటికీలెక్కడ
నాగరికత పెరిగాక
నా ఆశ నిరాశేగా!

Read Full Post »

ఆవేష పూరితమైన యవ్వనం
అనుభవ పూరితమైన వయసు
కలిసి జీవించలేవు.
ఆహ్లాదకరమైనది యవ్వనం
జాగరూకమై వుండేది వయసు
యవ్వనం గ్రీష్మ తాపమైతే
వయసు వసంత ఋతువు
యవ్వనం తాప ధైర్యం
వయసు నగ్నత్వపు చలి
యవ్వనం కేళీ పూరితమైతే
వయసు ఆయువు తక్కువ
యవ్వనం చురుకైనది
వయసు నెమ్మదైనది
యవ్వనం విచ్చలవిడి, వేడి నిట్టూర్పులు కలది
వయసు చల్లనిది, బలహీనమైనది
యవ్వనం కౄరమైనది
వయసు సాధువు
వయసు, నేను ద్వేషంతో, అయిష్టతతో చూస్తాను
యవ్వనం, గాఢంగా ప్రేమించి పూజిస్తాను
ప్రియతమా!
నా ప్రేమ ఎల్లప్పుడూ యవ్వనమే
నేను వయసును ఎల్లప్పుడూ ఎదిరిస్తాను
నీ కోసం సుదీర్ఘంగా నిరీక్షిస్తాను.

Read Full Post »

ఈ వాక్యాలు నావి కావు, కానీ ఇవి ఎప్పుడు ఎక్కడ చదివి వ్రాసుకున్నానో కూడా గుర్తు లేదు. అయినా ఇవెప్పుడూ నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. నా వంతయిపోయింది ఇక మరెవరిని వెంటాడతాయో చూడాలి…
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
నిన్ను చూసాను
నన్ను మరిచాను
ఒక తియ్యటి కల రాయంచలా
నా మధుర నిదురలోకి వచ్చింది వయ్యారంగా
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
ప్రేమంటే…
హృదయాన్ని పారేసుకోవటం కాదు
నువున్నపుడు కాలాన్నీ
నువు లేనపుడు నవ్వునీ పారేసుకోవటం
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
ప్రతి ఉదయం
సాయంత్రం
ఉషఃస్సు
సంధ్య
అపషోర్ణాహం
నీ నవ్వు
నీ స్పర్ష
నీ కళ్ళు
నీ శబ్దం
నీ నవ్వు
నీ మాట
నువ్వూ..
నేనూ..
నీ పిచ్చిలో నేను.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
నా హృదయ తపాల బిళ్ళ మీద
నీ చూపుల పోస్టల్ ముద్ర గుద్ది
నువ్వేమో చక్కా వెళ్ళిపోయావు
మరి నేనెటు వెళ్ళను!?
చిరునామా వ్రాయనిదే!
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
అంతరాంతర ఙ్ఞాపకాల్ని
వయసుడిగిన నేను నెమరేస్తే
తొలకరి వాన నన్ను తడిపేస్తుంది
ఎద పగిలిన ఙ్ఞాపకం
మాటకందని మౌనం
అది సజీవ వర్ణ కాన్వాసు.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
నీ వు వున్నపుడు
వాలేదానివి నా గుండె మీద
ఒక దండలా
నీవు ఇపుడు లేవు
కానీ వాలుతున్నావు ఒక కొండలా!
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
నీకేం తెలుసు నా అర్థ రాత్రుల్ని కాల్చే దీపానికే తెలుసు
నా నిట్టూర్పుల వేడి కథలు…
నీ సాయంకాలాన్ని అందంగా మలుద్దామని
ఒక ముద్దిస్తే
అది నీ గుండెలో తుఫానుగా మారుతుందనుకోలేదు..
నీ బుగ్గలు చిదిమి రోజా మొగ్గలు పూయిస్తే
చైత్ర పరిమళాలు నా నరాల్ని తెంచుతాయనుకోలేదు
నీ గోళ్ళలో పూచే గులాబీలు పెదవితో ముట్టుకుంటే
నా అన్ని స్మృతుల్నీ అవి రద్దు చేస్తాయనుకోలేదు
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
పురుషుడు భరించ లేడని తెలిసే
ఆ సృష్టికర్త…
స్త్రీలోని సౌకుమార్యాన్ని సుమాలకు
కాఠిన్యాన్ని శిలలకు కేటాయించి
శూన్యంలొని ధూలి కణమంత మాత్రమే మిగిల్చాడు
ఆ మాత్రానికే…
మాడి మసై పొతున్నాడీ అర్భకుడు.

Read Full Post »

నువ్వంటె ప్రేమ
నీ ప్రేమంటె ప్రేమ
ఉరుమంటే ప్రేమ…
మెరుపంటే ప్రేమ…
మబ్బు విరుపుల్లో
మెరుపు తలపంటి
నీ నవ్వంటే ప్రేమ.
కడలంటే ప్రేమ…
కవితంటే ప్రేమ
కడలి పొంగుల్లో
అలల ఊపంటి
నీ మాటంటే ప్రేమ
నెమలంటే ప్రేమ
నెనరంటే ప్రేమ
నెమలి నాట్యమంటి
నీ నడకంటే ప్రేమ
పూలంటే ప్రేమ
గాలంటే ప్రేమ
పూల గాలుల్లో
లాలి పటలాంటి
నీ వలపంటే ప్రేమ.

Read Full Post »

Older Posts »