Feeds:
టపాలు
వ్యాఖ్యలు

Posts Tagged ‘మౌనం’

ఏమిటా చూపులు..
ఇదే ఆఖరుసారన్నట్లుగా..
అపుడే పుట్టిన పసిబిడ్డను
చూస్తున్నంత అపురూపంగా
అసంకల్పితంగా చూసిన నాకు
నీ చూపుల తాకిడి ఉప్పెనలా తాకింది
నీ చూపుల తూటాలు
నాలో ఆశల్ని రేకెత్తించాయి
నీ కనురెప్పల మాటున ఆనందాన్ని నింపుకుని
నాలో పెను మంటలు రేపి
నన్నొంటరిని చేశావు
జీవిత గమనంలో
ఓ క్షణమేదో తలుక్కుమంటోంది
ఙ్ఞాపకాల పుటని తిరగేస్తే
ఆ క్షణమే
హృదయంలో చిరునవ్వుని
బాధల్నీ నింపేస్తుంది
ఎవరికి చెప్పను?
జన్మ జన్మల సంబంధాన్ని
ఆ కళ్ళు నాకు గుర్తు చేస్తున్నాయని
ఎలా చెప్పను?
అర్థం చెప్పుకోలేని అవ్యక్త భావంలా
ఆ చూపులు నన్నేదో ప్రశ్నిస్తున్నాయని
ఇవే రోజులు…
ఇవే క్షణాలు…
సాయంత్రాలు సంతోషాన్ని మోసుకొచ్చేవి
మనసు మధుర్యాల్ని వెదజల్లేది
మనిద్దరి చూపులు కలిసిన చోట
మట్టి రేణువులు సైతం మల్లెలై విరిసేవి
గాలి తరగలు గాంధర్వాల్ని ఆలపించేవి
క్షణాలు మాటల వనాలై మత్తుగా ఊగేవి
ఆశలు కిరణాలై హృదయాన్ని ఆవహించేవి
నీ కళ్ళు…
నా హృదయాన్ని ఊయలలూగించి
నన్ను వెంటాడుతున్నాయి
ఒంటరిగా…
అంతులేని ప్రశ్నలతో రాత్రులు మేలుకుని
ప్రతీక్షణాన్ని పరిశీలిస్తాను
ఇద్దరికీ మధ్య భౌతికంగా దూరం
మౌనంలోనే..
మోయలేని సంకేతాలని గ్రహించే మనసుకి
ఏ నిర్వచనాన్ని అందించను
నాకెప్పటికీ అర్థం కాదు
నీ ఙ్ఞాపకాలు నా మనసునెందుకిలా బాధిస్తాయో
నువు చెప్పవూ…

Read Full Post »