Feeds:
టపాలు
వ్యాఖ్యలు

Posts Tagged ‘కవిత’

నేస్తమా!
కదిలిస్తే చాలు గుండె ఒలికి పోతుంది
పలకరిస్తే చాలు మనసు పులకించి పోతుంది
తాకితే చాలు తనువులో విద్యుత్తు ప్రవహిస్తుంది
ఎలా ప్రారంభిచను ప్రియా
నీ కోసం ఈ గేయాన్ని
స్మరిస్తాను నిన్నే
విస్మరిస్తాను అన్నీ
నాలోని నిన్ను మినహా
ఆహ్వానం లేకుండానే
నా హృదయంలో ప్రవేశించి
నా జీవిగా చెరగని ముద్ర వేసావు
విరామమెరుగని ఈ హృదయ యాత్ర
నీ కోసమై దిగ్దిగంతాలు సాగుతూనే ఉంది
ఎంత నీ నుండి దూరమైనా
ఏదో విధాన, ఏదో రూపాన
నా దృష్టిని నీ వైపు మరల్చుకుంటున్నావు
నీవు రావు నన్ను పోనీవు
మరల్చి, మత్తెక్కించి,స్వప్నాలతో లాలించి
మధుర గానాలతో ఊగించి
ప్రపంచానికి వ్యర్థుణ్ని చేసావు
దిగులు కళ్ళతో,
వెర్రి చూపులతో,
మరపు మాటలతో,
అన్ని విశ్వాసాలు నశించి
తోవ తెలియక తిరుగుతున్నాడీ ప్రేమ బైరాగి.
నీ కోసం వెతికి వెతికి అలసి
చిక్కి శల్యమయ్యే ఈ నిర్భాగ్యుణ్ని చూసి
దిక్కులే నవ్వాయి, చుక్కలే ఏడ్చాయి…
నా జీవితం
అనంత సాగరంలా అనిపిస్తుంది నాకు
ఇందులో బడబాగ్నులూ ఉన్నాయి
ముత్యపు చిప్పలూ ఉన్నాయి
రెండూ అరుదైనవే, అమూల్యమైనవే
సముద్రపు కెరటాలు ఒకదానికొకటి పోటీ పడుతుంటాయి
జయాపజయాలకు అతీతంగా
అదొక నిరంతర పోరాటం
సముద్రపు కెరటాల చైతన్యం
జీవితాల్లో కనిపిస్తుంది నాకు
నిరంతరంగా..
జీవనదిలా..
జీవితం ప్రవహిస్తూనే ఉంటుంది

Read Full Post »

నీ కను బొమ్మలు మన్మధుని విల్లై
నీ చూపులే మన్మధుని బాణాలై
నాలో విరహాల మంట పెడుతున్నాయి

నీ పెదవులు హరివిల్లై
నీ నవ్వులు విరిజల్లై
నాలో కలల పంట పండుతున్నాయి

నీ కులుకులు శృతిలయలై
నీ పలుకులు సప్త స్వరాలై
నాలో వలపు కచేరి పెడుతున్నాయి

నీ నడక హంస కులుకులై
నీ నడుమొంపులు నెలవంకలై
నాలో గిలిగింతలు పెడుతున్నాయి

నీ కురులు కరిమబ్బులై
నీ ఎదలయలు జడివానలై
నా కవ్వింపుల జల్లులై పడుతున్నాయి

నీ పదసడి మేలుకొలుపులై
నీ తలపులు రామచిలకలై
నాలో కోరికల పరుగు పెడుతున్నాయి

Read Full Post »

 

వెలుగుపై చీకటి దాడి చేస్తున్న వేల
నిశీధి కలలు రెక్క విచ్చుకుంటున్నాయి
అనంత కోటి నక్షత్రాలు ఆకాశంలో మెరుస్తూ
వెలుగునంతటినీ నా ప్రేయసిపై కురిపిస్తున్నాయి

ప్రతి రోజు నిద్రకు ముందు నీ గురించి ఆలోచిస్తాను
కానీ.. నా స్వప్న లోకంలో నువెప్పుడూ కలవటం లేదు
ఏమో ఈనాటి రాత్రయినా అదృష్టం వరిస్తుందేమో
ఆ ఆనందాన్నంతటినీ ఒడిసి పట్టుకుంటాను

నేను అదృష్టవంతున్నయితే ఈ రేయంతా మనదే
పోనీ ఓ క్షణమైనా చాలు
నువ్విచ్చే తీయటి ముద్దులకు
నా సర్వస్వాన్నీ నీకు దాసోహం చేస్తాను

నా గుండెలో అనంతమైన ప్రేమ ఉంది
ఈ ప్రపంచంలో ఎవరితోను పంచుకోలేను
మృదువైన నీ శరీరం నా పక్కనే ఉన్న అనుభూతి
తక్కినవన్నీ తుచ్చమైపోతున్న భావన

వేడి నిట్టూర్పుల సెగలు చుట్టేస్తున్నాయి
మనిద్దరం వలపు వానలో తడుస్తున్నాం
నేనెప్పుడూ ఊహించలేదు
మనం స్వర్గాన్ని కనిపెడతామని

ఏమో…
ఏదో ఒకరోజు…
నా కల నిజమవుతుందేమో
అప్పటి వరకు నేను నిన్ను ప్రేమిస్తూనె ఉంటాను.

Read Full Post »

నా కలల నిండా
అందమైన ప్రవాహం
మెరుపై కనిపిస్తుంది

ప్రేమ నిండిన చూపులు
మస్తిష్కాన్ని బద్దలు కొట్టి
నన్నల్లుకుంటున్నాయి

నా హృదయం నిండా
ప్రియమైన స్పర్షానుభూతి
స్మరణకు వస్తోంది

అందమైన దేవత
తన నవ్వుతో
నా మనసుకు గాలాలేస్తోంది

సెలయేటిని తలపించే మరీచికా
చూపుల గాలాలేసే జవ్వని
రెండూ ఒకటే
ఏ దాహమూ తీరదు.

Read Full Post »

భవిష్యత్ పూల పానుపు మీద
పరిమళంలా నీవు
జీవితపు కిటికీ తెరిస్తే
సూర్యోదయంలా నీవు.
***          ***          ***
రాత్రంతా కురిస్తే
పగలు మిగిలిన వర్షచ్ఛాయల్లా..
తనువంతా కురిసిన
నీ అధరామృతపు చినుకులు
నీ ఙ్ఞాపకాలు.
***          ***          ***
నీవు ఙ్ఞాపకానికి వచ్చినపుడు
నా ఎద చప్పుడు
అపుడే పుట్టిన శిశువు ఏడుపు.
***          ***          ***
**From Tagore’s GEETANJALI

Read Full Post »

ఏమిటా చూపులు..
ఇదే ఆఖరుసారన్నట్లుగా..
అపుడే పుట్టిన పసిబిడ్డను
చూస్తున్నంత అపురూపంగా
అసంకల్పితంగా చూసిన నాకు
నీ చూపుల తాకిడి ఉప్పెనలా తాకింది
నీ చూపుల తూటాలు
నాలో ఆశల్ని రేకెత్తించాయి
నీ కనురెప్పల మాటున ఆనందాన్ని నింపుకుని
నాలో పెను మంటలు రేపి
నన్నొంటరిని చేశావు
జీవిత గమనంలో
ఓ క్షణమేదో తలుక్కుమంటోంది
ఙ్ఞాపకాల పుటని తిరగేస్తే
ఆ క్షణమే
హృదయంలో చిరునవ్వుని
బాధల్నీ నింపేస్తుంది
ఎవరికి చెప్పను?
జన్మ జన్మల సంబంధాన్ని
ఆ కళ్ళు నాకు గుర్తు చేస్తున్నాయని
ఎలా చెప్పను?
అర్థం చెప్పుకోలేని అవ్యక్త భావంలా
ఆ చూపులు నన్నేదో ప్రశ్నిస్తున్నాయని
ఇవే రోజులు…
ఇవే క్షణాలు…
సాయంత్రాలు సంతోషాన్ని మోసుకొచ్చేవి
మనసు మధుర్యాల్ని వెదజల్లేది
మనిద్దరి చూపులు కలిసిన చోట
మట్టి రేణువులు సైతం మల్లెలై విరిసేవి
గాలి తరగలు గాంధర్వాల్ని ఆలపించేవి
క్షణాలు మాటల వనాలై మత్తుగా ఊగేవి
ఆశలు కిరణాలై హృదయాన్ని ఆవహించేవి
నీ కళ్ళు…
నా హృదయాన్ని ఊయలలూగించి
నన్ను వెంటాడుతున్నాయి
ఒంటరిగా…
అంతులేని ప్రశ్నలతో రాత్రులు మేలుకుని
ప్రతీక్షణాన్ని పరిశీలిస్తాను
ఇద్దరికీ మధ్య భౌతికంగా దూరం
మౌనంలోనే..
మోయలేని సంకేతాలని గ్రహించే మనసుకి
ఏ నిర్వచనాన్ని అందించను
నాకెప్పటికీ అర్థం కాదు
నీ ఙ్ఞాపకాలు నా మనసునెందుకిలా బాధిస్తాయో
నువు చెప్పవూ…

Read Full Post »

ఆవేష పూరితమైన యవ్వనం
అనుభవ పూరితమైన వయసు
కలిసి జీవించలేవు.
ఆహ్లాదకరమైనది యవ్వనం
జాగరూకమై వుండేది వయసు
యవ్వనం గ్రీష్మ తాపమైతే
వయసు వసంత ఋతువు
యవ్వనం తాప ధైర్యం
వయసు నగ్నత్వపు చలి
యవ్వనం కేళీ పూరితమైతే
వయసు ఆయువు తక్కువ
యవ్వనం చురుకైనది
వయసు నెమ్మదైనది
యవ్వనం విచ్చలవిడి, వేడి నిట్టూర్పులు కలది
వయసు చల్లనిది, బలహీనమైనది
యవ్వనం కౄరమైనది
వయసు సాధువు
వయసు, నేను ద్వేషంతో, అయిష్టతతో చూస్తాను
యవ్వనం, గాఢంగా ప్రేమించి పూజిస్తాను
ప్రియతమా!
నా ప్రేమ ఎల్లప్పుడూ యవ్వనమే
నేను వయసును ఎల్లప్పుడూ ఎదిరిస్తాను
నీ కోసం సుదీర్ఘంగా నిరీక్షిస్తాను.

Read Full Post »

ఈ వాక్యాలు నావి కావు, కానీ ఇవి ఎప్పుడు ఎక్కడ చదివి వ్రాసుకున్నానో కూడా గుర్తు లేదు. అయినా ఇవెప్పుడూ నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. నా వంతయిపోయింది ఇక మరెవరిని వెంటాడతాయో చూడాలి…
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
నిన్ను చూసాను
నన్ను మరిచాను
ఒక తియ్యటి కల రాయంచలా
నా మధుర నిదురలోకి వచ్చింది వయ్యారంగా
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
ప్రేమంటే…
హృదయాన్ని పారేసుకోవటం కాదు
నువున్నపుడు కాలాన్నీ
నువు లేనపుడు నవ్వునీ పారేసుకోవటం
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
ప్రతి ఉదయం
సాయంత్రం
ఉషఃస్సు
సంధ్య
అపషోర్ణాహం
నీ నవ్వు
నీ స్పర్ష
నీ కళ్ళు
నీ శబ్దం
నీ నవ్వు
నీ మాట
నువ్వూ..
నేనూ..
నీ పిచ్చిలో నేను.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
నా హృదయ తపాల బిళ్ళ మీద
నీ చూపుల పోస్టల్ ముద్ర గుద్ది
నువ్వేమో చక్కా వెళ్ళిపోయావు
మరి నేనెటు వెళ్ళను!?
చిరునామా వ్రాయనిదే!
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
అంతరాంతర ఙ్ఞాపకాల్ని
వయసుడిగిన నేను నెమరేస్తే
తొలకరి వాన నన్ను తడిపేస్తుంది
ఎద పగిలిన ఙ్ఞాపకం
మాటకందని మౌనం
అది సజీవ వర్ణ కాన్వాసు.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
నీ వు వున్నపుడు
వాలేదానివి నా గుండె మీద
ఒక దండలా
నీవు ఇపుడు లేవు
కానీ వాలుతున్నావు ఒక కొండలా!
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
నీకేం తెలుసు నా అర్థ రాత్రుల్ని కాల్చే దీపానికే తెలుసు
నా నిట్టూర్పుల వేడి కథలు…
నీ సాయంకాలాన్ని అందంగా మలుద్దామని
ఒక ముద్దిస్తే
అది నీ గుండెలో తుఫానుగా మారుతుందనుకోలేదు..
నీ బుగ్గలు చిదిమి రోజా మొగ్గలు పూయిస్తే
చైత్ర పరిమళాలు నా నరాల్ని తెంచుతాయనుకోలేదు
నీ గోళ్ళలో పూచే గులాబీలు పెదవితో ముట్టుకుంటే
నా అన్ని స్మృతుల్నీ అవి రద్దు చేస్తాయనుకోలేదు
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
పురుషుడు భరించ లేడని తెలిసే
ఆ సృష్టికర్త…
స్త్రీలోని సౌకుమార్యాన్ని సుమాలకు
కాఠిన్యాన్ని శిలలకు కేటాయించి
శూన్యంలొని ధూలి కణమంత మాత్రమే మిగిల్చాడు
ఆ మాత్రానికే…
మాడి మసై పొతున్నాడీ అర్భకుడు.

Read Full Post »

నువ్వంటె ప్రేమ
నీ ప్రేమంటె ప్రేమ
ఉరుమంటే ప్రేమ…
మెరుపంటే ప్రేమ…
మబ్బు విరుపుల్లో
మెరుపు తలపంటి
నీ నవ్వంటే ప్రేమ.
కడలంటే ప్రేమ…
కవితంటే ప్రేమ
కడలి పొంగుల్లో
అలల ఊపంటి
నీ మాటంటే ప్రేమ
నెమలంటే ప్రేమ
నెనరంటే ప్రేమ
నెమలి నాట్యమంటి
నీ నడకంటే ప్రేమ
పూలంటే ప్రేమ
గాలంటే ప్రేమ
పూల గాలుల్లో
లాలి పటలాంటి
నీ వలపంటే ప్రేమ.

Read Full Post »

ప్రియతమా!
ఇది కలా నిజమా!
నా వేపు చూసి చిరునవ్వు చిందించావు
అది నీ నవ్వా!
కాదు…
నవనాడుల్నీ నిర్వీర్యం చేసే
విద్యుద్ఘాతమనుకుంటా…
అందుకేగా నా హృదయం గాయపడింది
నేనింకా తేరుకోనేలేదు…
నీలో గొప్ప విశేషమే ఉంది
అందుకే…
నా భావాలన్నీ నీతో పంచుకోవాలనే ఆరాటం
నీ ప్రేమ నాకు కొత్త లోకపు ద్వారాలను తెరచింది
నిన్ను చూస్తే చాలు
గుండె ఎగసి పడుతుంది
ఊపిరి ఆగినట్లుంటుంది…
ఒకప్పుడు…
ప్రేమంటే అంతా తెలుసనుకున్నాను
అది యదార్థం కాదు
మరో హృదయం కోసం
నా హృదయం ఇంతగా తపించలేదెప్పుడూ
నీ కళ్ళు… నీ నవ్వు…
నీకు సంబందించిన ప్రతిదీ
నాకే స్వంతమనిపిస్తుంది
నా భావల్ని నీకు వినిపించడానికి
మాటలెన్నో వెతుక్కుంటాను
కానీ…
ఏ పదాలు యదార్థాన్ని వివరించలేవు
బంగరు భవన సముదాయంలో
నువ్వెలా ఉన్నావో చూడాలని వచ్చాను
వాస్తవంగా నువ్వెవరితోనో ఉన్నావు
నేను వరండా చివరన నీ కోసం నిరీక్షిస్తున్నాను
నీవు నావేపు రావాలని
నా కళ్ళలోని బాధ  చూడాలని ఆశించాను
నాకు తెలుసు అతనొక స్పందన లేని వాడని
నాకు తెలుసు నిన్నతను ప్రేమించడం లేదని
నాకు తెలుసు నీ హృదయమెక్కడుందో
నాకు తెలుసు నీ మానసిక స్థితేమిటో
వాని నుంచి బయటపడి చెప్పు
నువెప్పటికీ చెప్పలేవు
తెలియని  కారణాల వలన మనం కలుసుకోలేము
నీ మీది ప్రేమను ఎప్పటికీ వదులుకోలేను
ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను
భౌతికంగా నువ్వెక్కడున్నా
నా హృదయంలో శాశ్వతంగా ఉంటావు.

Read Full Post »

Older Posts »