Feeds:
టపాలు
వ్యాఖ్యలు

Posts Tagged ‘తెలుగు సాహిత్యం’

 

ఏమైంది నాకీ రోజు
మనస్సుపదే పదే వేగిర పడుతోంది
అదేం ఖర్మో…
ఇంకా తెలవారదేం!
రెండు వందల మైళ్ళ దూరం
అలవాటు లేని ప్రయాణం…
అలసిన శరీరం నిదురమత్తులోకి జారదేం?
ఓహ్…
నిన్ను చూడాలనే ఆరాటంతో
కునుకు రావడం లేదనుకుంటా!
నిదుర మత్తులో ఈ నగరం
పసిపాప మోములా ప్రశాంతంగా ఉంది
అక్కడక్కడ వినిపించే చిమ్మెటల సవ్వడి
అప్పుడప్పుడు వినిపించే గుడ్లగూబ అరుపులు
ఇవి తప్ప అంతా ప్రశాంతమే
మరో అలికిడైనా లేని వేళ
నా రాక నీకు తెలిసేదెలా?
ఆకసాన చందమామనై,
చందాంశు కిరణాలను
నా చూపుగా మలచి,
సగం తెరచిన కిటికీ గుండా నిన్ను చూడాలని…
నీకూ నాకూ మధ్య దూరాన్ని
పిల్ల తెమ్మరనై చెరిపెయ్యాలని…
ఎగసి పడే నీ కురులని
అలవోకగా సరి చేయాలని…
వేకువలో వేగు చుక్కనై
నీ వాకిటి ముందు వాలాలని…
నీలి మబ్బుల గొడుగు కింద
నిదుర మత్తుని పులుముకుని
ఒళ్ళు విరుచుకుంటూ మంచం దిగే నిన్ను
చూడాలని ఒకటే ఆరాటం…
తొలి సంధ్య వేళ
వాకిట కళ్ళాపు చల్లి,
అణువణువూ మమేకమైపోతూ,
నాజూకు వేల్ల మధ్య నుండి
తెల్లని ముగ్గు ధారల్ని పోస్తూ,
తుంటరి గాలి చేసే అల్లరికి
అలలా కదిలే ముంగురులని
పైకి ఎగదోసినప్పుడు…
నీ నుదుటిపై అంటుకున్న ముగ్గుని
నా అర చేత తుడవాలని…
అభ్యంగన స్నానం చేసి
ఆరుబయట తలారబెట్టుకుంటూ
అద్దం ముందు మెరుగులు దిద్దుకునే
నీ పక్కన చేరి…
అల్లరి చేయాలని
మనసంతా ఒకటే ఆరాటం.
ఇప్పుడు…
వేకువ ఝాము కళ్ళాపులెక్కడ
ముని వాకిట ముత్యాల ముగ్గులెక్కడ
ఏసీలు వచ్చాక తెరచిన కిటికీలెక్కడ
నాగరికత పెరిగాక
నా ఆశ నిరాశేగా!

Read Full Post »

ఆవేష పూరితమైన యవ్వనం
అనుభవ పూరితమైన వయసు
కలిసి జీవించలేవు.
ఆహ్లాదకరమైనది యవ్వనం
జాగరూకమై వుండేది వయసు
యవ్వనం గ్రీష్మ తాపమైతే
వయసు వసంత ఋతువు
యవ్వనం తాప ధైర్యం
వయసు నగ్నత్వపు చలి
యవ్వనం కేళీ పూరితమైతే
వయసు ఆయువు తక్కువ
యవ్వనం చురుకైనది
వయసు నెమ్మదైనది
యవ్వనం విచ్చలవిడి, వేడి నిట్టూర్పులు కలది
వయసు చల్లనిది, బలహీనమైనది
యవ్వనం కౄరమైనది
వయసు సాధువు
వయసు, నేను ద్వేషంతో, అయిష్టతతో చూస్తాను
యవ్వనం, గాఢంగా ప్రేమించి పూజిస్తాను
ప్రియతమా!
నా ప్రేమ ఎల్లప్పుడూ యవ్వనమే
నేను వయసును ఎల్లప్పుడూ ఎదిరిస్తాను
నీ కోసం సుదీర్ఘంగా నిరీక్షిస్తాను.

Read Full Post »

ఈ వాక్యాలు నావి కావు, కానీ ఇవి ఎప్పుడు ఎక్కడ చదివి వ్రాసుకున్నానో కూడా గుర్తు లేదు. అయినా ఇవెప్పుడూ నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. నా వంతయిపోయింది ఇక మరెవరిని వెంటాడతాయో చూడాలి…
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
నిన్ను చూసాను
నన్ను మరిచాను
ఒక తియ్యటి కల రాయంచలా
నా మధుర నిదురలోకి వచ్చింది వయ్యారంగా
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
ప్రేమంటే…
హృదయాన్ని పారేసుకోవటం కాదు
నువున్నపుడు కాలాన్నీ
నువు లేనపుడు నవ్వునీ పారేసుకోవటం
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
ప్రతి ఉదయం
సాయంత్రం
ఉషఃస్సు
సంధ్య
అపషోర్ణాహం
నీ నవ్వు
నీ స్పర్ష
నీ కళ్ళు
నీ శబ్దం
నీ నవ్వు
నీ మాట
నువ్వూ..
నేనూ..
నీ పిచ్చిలో నేను.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
నా హృదయ తపాల బిళ్ళ మీద
నీ చూపుల పోస్టల్ ముద్ర గుద్ది
నువ్వేమో చక్కా వెళ్ళిపోయావు
మరి నేనెటు వెళ్ళను!?
చిరునామా వ్రాయనిదే!
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
అంతరాంతర ఙ్ఞాపకాల్ని
వయసుడిగిన నేను నెమరేస్తే
తొలకరి వాన నన్ను తడిపేస్తుంది
ఎద పగిలిన ఙ్ఞాపకం
మాటకందని మౌనం
అది సజీవ వర్ణ కాన్వాసు.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
నీ వు వున్నపుడు
వాలేదానివి నా గుండె మీద
ఒక దండలా
నీవు ఇపుడు లేవు
కానీ వాలుతున్నావు ఒక కొండలా!
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
నీకేం తెలుసు నా అర్థ రాత్రుల్ని కాల్చే దీపానికే తెలుసు
నా నిట్టూర్పుల వేడి కథలు…
నీ సాయంకాలాన్ని అందంగా మలుద్దామని
ఒక ముద్దిస్తే
అది నీ గుండెలో తుఫానుగా మారుతుందనుకోలేదు..
నీ బుగ్గలు చిదిమి రోజా మొగ్గలు పూయిస్తే
చైత్ర పరిమళాలు నా నరాల్ని తెంచుతాయనుకోలేదు
నీ గోళ్ళలో పూచే గులాబీలు పెదవితో ముట్టుకుంటే
నా అన్ని స్మృతుల్నీ అవి రద్దు చేస్తాయనుకోలేదు
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
పురుషుడు భరించ లేడని తెలిసే
ఆ సృష్టికర్త…
స్త్రీలోని సౌకుమార్యాన్ని సుమాలకు
కాఠిన్యాన్ని శిలలకు కేటాయించి
శూన్యంలొని ధూలి కణమంత మాత్రమే మిగిల్చాడు
ఆ మాత్రానికే…
మాడి మసై పొతున్నాడీ అర్భకుడు.

Read Full Post »

నువ్వంటె ప్రేమ
నీ ప్రేమంటె ప్రేమ
ఉరుమంటే ప్రేమ…
మెరుపంటే ప్రేమ…
మబ్బు విరుపుల్లో
మెరుపు తలపంటి
నీ నవ్వంటే ప్రేమ.
కడలంటే ప్రేమ…
కవితంటే ప్రేమ
కడలి పొంగుల్లో
అలల ఊపంటి
నీ మాటంటే ప్రేమ
నెమలంటే ప్రేమ
నెనరంటే ప్రేమ
నెమలి నాట్యమంటి
నీ నడకంటే ప్రేమ
పూలంటే ప్రేమ
గాలంటే ప్రేమ
పూల గాలుల్లో
లాలి పటలాంటి
నీ వలపంటే ప్రేమ.

Read Full Post »

ప్రియతమా!
ఇది కలా నిజమా!
నా వేపు చూసి చిరునవ్వు చిందించావు
అది నీ నవ్వా!
కాదు…
నవనాడుల్నీ నిర్వీర్యం చేసే
విద్యుద్ఘాతమనుకుంటా…
అందుకేగా నా హృదయం గాయపడింది
నేనింకా తేరుకోనేలేదు…
నీలో గొప్ప విశేషమే ఉంది
అందుకే…
నా భావాలన్నీ నీతో పంచుకోవాలనే ఆరాటం
నీ ప్రేమ నాకు కొత్త లోకపు ద్వారాలను తెరచింది
నిన్ను చూస్తే చాలు
గుండె ఎగసి పడుతుంది
ఊపిరి ఆగినట్లుంటుంది…
ఒకప్పుడు…
ప్రేమంటే అంతా తెలుసనుకున్నాను
అది యదార్థం కాదు
మరో హృదయం కోసం
నా హృదయం ఇంతగా తపించలేదెప్పుడూ
నీ కళ్ళు… నీ నవ్వు…
నీకు సంబందించిన ప్రతిదీ
నాకే స్వంతమనిపిస్తుంది
నా భావల్ని నీకు వినిపించడానికి
మాటలెన్నో వెతుక్కుంటాను
కానీ…
ఏ పదాలు యదార్థాన్ని వివరించలేవు
బంగరు భవన సముదాయంలో
నువ్వెలా ఉన్నావో చూడాలని వచ్చాను
వాస్తవంగా నువ్వెవరితోనో ఉన్నావు
నేను వరండా చివరన నీ కోసం నిరీక్షిస్తున్నాను
నీవు నావేపు రావాలని
నా కళ్ళలోని బాధ  చూడాలని ఆశించాను
నాకు తెలుసు అతనొక స్పందన లేని వాడని
నాకు తెలుసు నిన్నతను ప్రేమించడం లేదని
నాకు తెలుసు నీ హృదయమెక్కడుందో
నాకు తెలుసు నీ మానసిక స్థితేమిటో
వాని నుంచి బయటపడి చెప్పు
నువెప్పటికీ చెప్పలేవు
తెలియని  కారణాల వలన మనం కలుసుకోలేము
నీ మీది ప్రేమను ఎప్పటికీ వదులుకోలేను
ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను
భౌతికంగా నువ్వెక్కడున్నా
నా హృదయంలో శాశ్వతంగా ఉంటావు.

Read Full Post »

నీ నవ్వు చూస్తే
మల్లె పూవు తెల్లబోతుంది
నీ మోము చూస్తే
నిండు వెన్నెల వెల వెలబోతుంది
నీ నడక చూస్తే
నెమలి నాట్యమాడదు
నీ మాట వింటే
కోకిలమ్మ రాగాలాపుతుంది
నేనెంత…

Read Full Post »

ఒకానొక సమయాన
అవ్యక్త భావం
మనసుని పట్టి కుదిపేస్తుంది
కళ్ళల్లోంచి నీటిధారలు
ఏరులై సాగి
ఎదననంతా తడిపేస్తాయి
అశక్తంగా…
జాలిగా…
అణువణువునూ రగిలిస్తూ…
నా కళ్ళముందు
ప్రేమ మైకంలో
ఎన్నో జీవితాలు గిడసబారి పోయాయి
ప్రేమ…
ఎంత అందమైన భావన
జాతి – మతం,
ఆస్తి – అంతస్తు,
తారతమ్యాలంటూ ఎరగదు
సమభావన ప్రేమ
క్రమశిక్షణ ప్రేమ
ద్వేషం లేనిది ప్రేమ
అనురాగం, కరుణ, మృదుత్వం ప్రేమ
అలాగే…
ప్రేమ ఒక జ్వాల
విరహాల మంటల్లో
మనసును మాడ్చేసి
అనంత దుఃఖాన్ని మిగిల్చేదీ ప్రేమే
అదొక ఆట…
మనసు మనిషితో ఆడుకునే ఆట
ఆశించింది దక్కితేనే గెలుపు
గెలిచిన వారి కంటే
ఓడిన వారే ఎక్కువ
అయినా…
అందరూ ఆ ప్రేమలోనే పడుతున్నారు
కానీ…
ఎంత మందికి స్వచ్చమైన మనసుంది?
ప్రేమికులం అని చెప్పుకునే వారికి
ప్రేమంటే తెలుసా!
ఆకర్షణ, అధికారం,
స్వార్థం, సంకుచితత్వం,
లైంగిక మోహం…
ఇవీ నేటి ప్రేమకు లక్షణాలు
ప్రేమ…
ఉన్నతమైనది,
ఉన్మత్తమైనదీ,
ప్రేమించడం..
ప్రేమించబడటం..
రెండూ అర్హతలు కావు
ప్రేమలోని గొప్పదనం
ప్రేమలోని గాఢత్వం
అనుభవంలోకి రావాలంటే
ప్రేమ విఫలం కావాలి
అప్పుడే ప్రేమ విలువ తెలిసేది
నేటి ప్రేమికుల దురదృష్టం ఏమంటే
వాళ్ళ ప్రేమలు
శరీరాల కలయికతో నిలిచిపోవడం
అనంతమూ అనన్యమూ అయిన ప్రేమలోకంలో
శరీరాల కలయిక ఒక సోపానం మాత్రమే
ఈ కలయిక లేని ప్రేమ
నేడు కోటికొక్కరిలో ఉంటుందేమో!
మిగిలిన వారందరికీ…
శరీర దాహం తీర్చుకోవడమే ప్రేమ!

Read Full Post »

నేను ఒంటరిగా చీకట్లో కూరుకు పోయాను
నీవు నాకు జీవితపు వెలుగును చూపించావు!
ప్రతి విషయాన్ని కాంతిమయం చేస్తూ
నీ చిరు నవ్వుని నాకిచ్చావు!
నేను విచారంగా ఉన్నపుడు
నీవు సంతోషాన్ని మోసుకొస్తావు!
నీ నవ్వుల్ని నాతో పంచుకుని
నా దు:ఖాన్ని దూరం చేస్తావు!
నేస్తమా!
నమ్మకం అంటే అర్థం తెలిసేలా చేశావు
నేను బలహీనంగా ఉన్నపుడు శక్తినిచ్చావు
నేను అపనమ్మకంలో పడినప్పుడు నన్ను ప్రేరేపించావు
ఇప్పుడు!
నేనేమిటో తెలుసుకునేలా చేశావు
నీవు నా కోసం చేసిన వాటికి
కృతఙ్ఞతలు ఎలా తెలుపుకోను?
నా జీవితమంతా హృదయంలో
గుడి కట్టి పూజించడం తప్ప!

Read Full Post »

ఒకనాడు అనుకోకుండా
నా జీవితంలోకి వచ్చావు
నీతోనే జీవితమనుకున్నా
నువ్వు లేనిదే నేను లేననుకున్నా
అన్నీ నీతో పంచుకున్నా
కానీ…
నువ్వు నన్ను మరచిపోయావు
మరెవరికో దగ్గరయ్యావు
నా హృదయమెప్పుడో పగిలి పోయింది
నన్ను చంపుతావెందుకు
ప్రేమ పేరుతో
నువ్వు చేసిన గాయమింకా మానలేదు
ఈ జీవితమింతే అనుకున్న సమయాన
నువ్వు కనిపించావు
పోతున్న ప్రాణం తిరిగొచ్చింది
ఇక జీవితమంతా సంతోషమే అనుకున్నా
నేనెంతగా ఏడ్చానో
నీకు చెప్పాలనుకున్నా
కానీ..!
నువ్వేం చేసావు!
నన్ను మరచి పొమ్మన్నావు
మనిద్దరికి పొసగదని చెప్పావు
సంవత్సరాల తరబడి తిరిగాక
నీకు మరో అందం కనబడే వరకు
నేను తెలుసుకోలేక పోయాను
నువు చెప్పింది విన్నాక
ఇంటికెలా వచ్చానో తెలియదు
గుమ్మం ముందు అమ్మ పలకరించినా
వినిపించుకోలేదు
కంటి ముందు అంతా చీకటి
యేమి చెస్తున్నానో తెలియదు
కానీ…
ఒకటి మాత్రం నిజం
రేపుదయం ఈ లోకమంతా వినిపిస్తుంది
“పాపం ఎవరో ప్రేమ పేరుతో మోసం చేశారంట”.

Read Full Post »

నిన్ను చూసి ఎన్నాళ్ళయిందో
నన్ను నేను పోగొట్టుకుని అన్నాళ్ళయింది
ఇన్నాళ్ళూ…
నా మనో వీధిలో
దు:ఖ జలధులు పొంగుతూనే ఉన్నాయి
నిజానికి…
ఎన్నో దినాలు వచ్చి వెళ్ళాయి
నేను మాత్రం
నిన్ను చూసిన క్షణంలోనే ఉండిపోయాను
నేను నేనుగా లేను
నీ తొలి చూపు సోకి
మనసు మల్లె పందిరయ్యింది
నీ చెరగని చిరునవ్వు
గుందెల్లో గులాబీలు పూయిస్తుంటే
అక్షర యుద్ధం చేసే కవి సామ్రాట్టునయ్యాను
కవన కౌతుకమై గిరికీలు కొడుతున్నాను
కూని రాగాల కూనలమ్మనయ్యాను
అందుకే అంటున్నాను…
నేను నేనుగా లేను…
నూతనోత్సాహం అణువణువునా నింపుకుని
తటిల్లున మెరిసే మెరుపునయ్యాను
నీలి గగనాన కారు మేఘ మాలికలతో
సరసాలడే చందమామనయ్యాను
నేను నేనుగా లేను…
ఆ క్షణమే నేను నువ్వయ్యాను

Read Full Post »

« Newer Posts - Older Posts »