Feeds:
టపాలు
వ్యాఖ్యలు

Posts Tagged ‘లేఖిని’

నిన్ను చూసి ఎన్నాళ్ళయిందో
నన్ను నేను పోగొట్టుకుని అన్నాళ్ళయింది
ఇన్నాళ్ళూ…
నా మనో వీధిలో
దు:ఖ జలధులు పొంగుతూనే ఉన్నాయి
నిజానికి…
ఎన్నో దినాలు వచ్చి వెళ్ళాయి
నేను మాత్రం
నిన్ను చూసిన క్షణంలోనే ఉండిపోయాను
నేను నేనుగా లేను
నీ తొలి చూపు సోకి
మనసు మల్లె పందిరయ్యింది
నీ చెరగని చిరునవ్వు
గుందెల్లో గులాబీలు పూయిస్తుంటే
అక్షర యుద్ధం చేసే కవి సామ్రాట్టునయ్యాను
కవన కౌతుకమై గిరికీలు కొడుతున్నాను
కూని రాగాల కూనలమ్మనయ్యాను
అందుకే అంటున్నాను…
నేను నేనుగా లేను…
నూతనోత్సాహం అణువణువునా నింపుకుని
తటిల్లున మెరిసే మెరుపునయ్యాను
నీలి గగనాన కారు మేఘ మాలికలతో
సరసాలడే చందమామనయ్యాను
నేను నేనుగా లేను…
ఆ క్షణమే నేను నువ్వయ్యాను

Read Full Post »

ప్రియతమా!
నన్ను నీ వెంట పడేలా చేసి
నీవు మరో మజిలీలో పయనిస్తున్నావు
నీ కోసం అణువణునూ
ఆలోచన లేని కాలంలా ఆరా తీస్తుంటే
నన్నిలా మభ్య పరచడం భావ్యమా!
నా ప్రేమను ఎప్పటికైనా తెలుసుకుంటావని
అనుకున్న సందర్భాలెన్నో
నా స్నేహితులు నన్ను కలిసినప్పుడు
ఎందుకదోలా ఉన్నావు? అన్నా..
ఎందుకంత సంతోషం! అన్నా..
ఎందుకీ మౌనం! అన్నా..
అన్నిటికీ నా సమాధానం
నా ప్రేయసి..!

Read Full Post »

నువు వినగలిగితే
నా గుండె శబ్దాన్ని విను
అది ఏడుస్తోందని
నీకు మాత్రమే తెలుస్తుంది
నువు చూడగలిగితే
నా అంతరాత్మలోకి తొంగి చూడు
నువు లేని ఆత్మ
మండిపోతూ కనిపిస్తుంది
నువు చదవగలిగితే
నా తలలోకి దూరిపో
నేనెంతగా నిన్ను
కోల్పోయానో తెలుస్తుంది
నువు నా నాడులలో
ఉరకలెత్తే రక్తాన్ని చూస్తే
అది ఎవరి కోసం
తాపత్రయ పడుతోందో తెలుస్తుంది.
నువు నా కళ్ళల్లోకి చూస్తే
వాటి వెనక విశాదం కనిపిస్తుంది
ఆ విశాదానికి కారణమైన నీవు
నాకు అందనంత దూరం లో ఉన్నావు.

Read Full Post »

ప్రియమైన నెచ్చెలీ!
మది నిండా పులుముకున్న నీ ఙ్ఞాపకాలతో
స్వర్ణ భవన సముదాయంలో అడుగు పెడితే
కారల్ మార్క్స్ రోడ్
కాల నాగై
కాల కూట విషం చిమ్ముతోంది.
మొత్తం దేహమంతా
భుగ భుగలాడుతోంది
కోటాను కోట్ల ఆశల ఊహల్లో
నిన్ను వెతుక్కుంటూ వచ్చాను

అమావాస్య నిశిలో
అగుపించని చందమామలా
నువ్వూ కనిపించవేం?
నువు ఆరాధించే ఏ దేవుడూ
నేను కొలిచే ఏ దైవమూ…
నా ఈ విరహాన్ని చల్లార్చడు
కాలం గడుస్తోంది
నువ్వు కానరావు
నాకేమో ఆశ చావదు
నమ్ముకున్న వాళ్ళ నీడలో
నిత్య సంతోషంగా నువ్వున్నావు
నిన్ను నమ్ముకుని
నిత్య దు:ఖంలొ నేనున్నాను
నిద్రలన్నీ గాడతలోకి జారే
ఓ అర్ధరాత్రి అకస్మాత్తుగా గుర్తొస్తావు
దిగ్గున లేచి కూర్చుంటాను
నిశ్శబ్దమై పోవడం ఆనందం కాదు
కానీ తప్పటం లేదు
నల్లని చీకటి వెనక ఏముంటుంది?
అనంతమైన నిశ్శబ్దంలోంచి…
దూరంగా ఏదో సవ్వడి
ఎవరో తిరుగుతున్న అలికిడి
కాలికి వెండి పట్టాలు కట్టుకుని
చిరు మువ్వల అలజడితో
నా వేపే వస్తున్న భావన…
అపరాత్రి వేళ వచ్చేదెవరా అని
ఆత్రంగా చూసి తేరుకునే లోగా
కనుమరుగై పోతావు.
నిన్ను చూసిన ప్రతిసారి
సముద్రాన్ని చూసినట్లే ఉంటుంది
సముద్రం లోతు తెలియనట్లే
నీ మనసు కూదా…
అదే నవ్వు…
అదే నడక…
అయినా నువు నిత్య నూతనం.

Read Full Post »

సంధ్యా!
నీ దేహ పరిష్వంగం లో ఒదిగి పోవాలని
అనాదిగా ఎదురు చూస్తున్నా
ఆ మహోన్నత సమయం కోసం
సమస్త ప్రకృతి నా వేపే చూస్తోంది
సువిశాల శూన్యం లో
మన దారులు సమాంతర రేఖలేనేమో!
నేనొక అగ్ని శిఖనని
ఏ అనుభూతులూ అఖ్ఖర్లేదని గర్వం
అందుకే కదూ ఒంటరినయ్యాను
ఇదంతా నీ గురించి తెలియక ముందు
తొలిసారి నీ గురించి విన్నాక
మన్సులో తెలియని అలజడి.
ప్రతి రోజు అందంగా ముస్తబై
నిన్ను చూడాలని వస్తున్నా
నీ జాడ తెలియక మండి పడుతూ
తూరుపునుండి పశ్చిమానికి వెతుకుతున్నా!
నా గమనం లో…
ఎందరో నన్నాడిపోసుకుంటున్నారు
కాల్చేస్తున్నానని, మాడ్చేస్తున్నానని
నేనేం చేయను సంధ్యా?
నీ విరహంలో నేనొక సమిధను
నేనెట్లా కాల్చను…
స్వయంగా నేనే కాలిపోతుంటే!
నువు నాకంటే ముందుగా
నా దారిలోనే వెలుతున్నావని తెలిసింది
అయినా నిన్ను చేరలేకున్నాను
నువ్వెలా ఉంటావో చూసిరమ్మని
చందురున్ని పంపా
నీ అందం చూసి గులామై
నీ నుదుట సింధూరమయ్యాడని
తరవాత తెలిసింది
నా శరీరాన్ని ముక్కలుగా చేసి
చుక్కలుగా పంపా…
మోసం చేసి..
నీ చెక్కిట కెంపులయ్యాయి
వాయువుని పంపా..
నీ సమాచారం చెప్పమని…
సమస్త ప్రాణికి ఆహ్లాదం పంచుతున్నాడంట నీతో కలిసి
వరుణిన్ని పంపా నిన్ను ముద్దగా తడపమని
అపుడైనా చలికి వణుకుతూ…
నా బాహువుల్లో ఒదిగిపోతావని
శూన్యం నుండి రాలే ప్రతి చినుకునూ
నిన్ను చేరనివ్వడం లేదు భూదేవి.

కొండా కోనా
చెట్టూ పుట్టా
పశు పక్షి…మనుషులు
సమస్త లోకమూ
నీ రాకకై ఎదురు చూస్తున్నాయట
సేద తీరుస్తావని
ఎందరికో ఆత్మీయమైన నీ రాక
నాకు మాత్రమే కరువయ్యిందేం..?

ఎడబాటు…
ఎందరో కవులు ప్రభందాల్లో
ఎంతో అందంగా వర్ణించారు
యావత్ప్రపంచంలోని
సమస్త వస్తు గుణాలతో పోల్చారు
విరహం…
కాల్చేస్తుందనీ…
మాడ్చేస్తుందనీ…
స్వయంజలితమైన నేను
అనుభవిస్తున్న విరహాన్ని
ఏ మాటలతో వర్ణించను సంధ్యా!
కాల్చడం, మాడ్చడం వంటి మాటలు చాలవు
సప్త లోకాల్లోని భాషల్ని వెతికినా
నేననుభవించే విరహాన్ని వివరించే పదాలు లేవు

ఎదురు చూపుల్లో…
ఎంతో ఆనందం ఉంటుందంటారు
నీ ఎదురు చూపుల్లో నాకెందుకింత విషాదం
పదే పదే…
నీవు సంచరిచే దారుల్లో వేచి ఉంటానా!
అక్కడేమున్నాయని?
నువ్వు లేవు నవ్వుల్లేవు
మనసు లేదు మమతల్లేవు
చూపుల్లేవు ప్రేమల్లేవు
అంతా విషాదమే…
అయినా నీ కోసమే నా నిరీక్షణ

వసంత కాలం లో ఆమని కోయిల
ఎంత ఆనదంగా గీతాల్నాలపిస్తోంది
నా విరహాగ్నిని ఏ మాత్రం చల్లార్చలేని
అ గీతాల్ని ఎలా ఆస్వాదించను
కళ్ళన్నీ దు:ఖ జలధులై వర్శిస్తుంటే
ఓదార్పునిచ్చే తోడు లేని జీవితంతో
ఎంత కాలమీ పోరాటం?

సూర్యున్ని ఆర్పేసి
పడమటింటి గూట్లో
వెన్నెలదీపాన్ని వెలిగిస్తోంది దినం
అష్ట దిక్కులేకమై
ఎందుకని దినాన్ని ప్రశ్నిస్తే
నా సంధ్య కోసమంది
దినం దీపం వెలిగించే వేళ
పడమటి కనుమల్లో
కుంగిపోతున్న నన్ను
పక్షులు పలకరిస్తే
గొంతు పెగల లేదు
నిప్పులు చెరిగే నీలో కన్నీళ్ళా అని
పక్షులు చెప్పేవరకు తెలీదు
నాలోనూ హిమనదాలున్నాయని

సంధ్యా!
నీవు లేని నేను లేనని తెలుసు నీకెపుడో
తెలిసి నేను నిన్ను చేరినా
తెలియక నే పడిన వెతలెన్నో
తెలియని అఙ్ఞానాంధకారంలో
అలసి సొలసి నేను తిరుగుతుంటే
తెలిసీ తెలియనట్లు వెన్నంటే ఉంటూ
జాడ తెలియనీకుండా..
బ్రతుకు సమిధలో ఆజ్యం పోస్తున్నావు
నీ ఊహలు నా మది నిండా నింపుకుని
నీ సందిట చేరాలని కలలు కంటూ వచ్చాను
నీవు కనిపించలేదని విలపించానే గాని
నింగి నీ సదనమని, వెన్నెల నీ వదనమని
కళ్ళుండీ చూడలేక పోయాను
నీ చేతిలో చెయ్యేసి
పున్నమి వెన్నెల వెలుగుల్లో
కృష్ణా తీరపు ఇసుక తిన్నెల్లో అడుగులెయ్యాలని
పొంగి పోయనేగాని
పొంగి పొరలే తరంగాలు
నీ మేని పొంగులని
తెలివుండీ తెలుసుకోలేక పోయాను
నీ పలుకు కోసం, నీ చల్లని చూపు కోసం
వీనులను వినువీధిలో పరిచాను
నీ పలుకు కోసం నా గుండె చప్పుడాపుకున్నాను
నీ రాకకై నేలనై పచ్చని తివాసీ పరిచాను
దారి చూపేందుకు నే వెన్నెలనౌదామనుకుంటే
నెల సగమే వెలిగే వెన్నెల కావొద్దని మనసొకటే గోల!
సముద్రమంత సంబరంతో
నీ చంద్ర వదన శోభకు
తరువుల పచ్చదనాన్ని, విరుల తెల్లదనాన్ని
వెన్నెల చల్లదనాన్ని
పారిజాత పరిమళాలతో రంగరించి
మదిలోని భావ తరంగాల్ని
అనురాగ రసాల్లో కలిపి ముద్ద చేసి
నీ సుతి మెత్తని పాదాలకు పారాణి పూయాలని
నీ పలకరింపుతో పులకరించాలని
నీ ఎద సందిట పరవశించాలని
నా తనువంతా కళ్ళుగా నిరీక్షిస్తున్నా…

Read Full Post »

bask

అరిగేలా నడిచే కాళ్ళకు
కరిగేలా చూసే కళ్ళకు
తహ తహలాడే తనువుకు తప్ప
నీకేం తెలుసు…
నీ కోసం నా హృదయం
హారతి కర్పూరంలా
కరిగి పోతొందని.

Read Full Post »

స్మృతులు గత స్మృతులు…
హృదయం నిండా నీ స్మృతులు
నువు సంచరించిన చోట అడుగిడగానే
నువు విడిచెల్లిన నీ మేని గుభాళింపులు
నా నరనరాన అగ్నిని రాజేస్తున్నాయి
నీ మేని నుండి రాలిన పరిమళాల్లో
నేనొక కాలిపోతున్న యవ్వనాన్ని.

అనుక్షణం నీ స్మృతులతో జ్వలిస్తూ
బంగరు భవన సముదాయం లో
నువ్వు వస్తావనే ఆశతో ఎదురు చూస్తున్నా
నువ్వక్కడ లేక పోయినా…
ఏదో క్షణాన నువొస్తావనే నమ్మకం.
పశ్చిమాన అస్తమించే సూర్యుడు
వెళుతూ వెళుతూ లోకాన చీకట్లు గుమ్మరించినట్లు
నువెళ్ళినప్పటి నుండి నా దేహం నిండా నిస్సత్తువ                                                                 

అణగారి పోతున్న నా ఆశలకు
నిశి రాత్రి లోని శశి
నీలి మబ్బుల మాటు నుండి తొంగి చూస్తూ
నీ రూపాన్ని మోసుకొస్తోంది
రాత్రంతా నువు నా పక్కనున్నావనే భావాన్ని
మది నిండా పులుముకుని
అలసి పోయిన నన్ను
తూరుపు సూరీడు ఉత్సాహ పరుస్తున్నాడు.

తన ఆయువు పన్నెండు గంటలే అయినా
దినం మారి దినం ఉద్భవించే
ఆ భాస్కరుని సాక్షిగా
ఈ భాస్కరుని నిరీక్షణ ఆగదు.

Read Full Post »

« Newer Posts