Feeds:
టపాలు
వ్యాఖ్యలు

Posts Tagged ‘తెలుగు బ్లాగులు’

ఒకానొక సమయాన
అవ్యక్త భావం
మనసుని పట్టి కుదిపేస్తుంది
కళ్ళల్లోంచి నీటిధారలు
ఏరులై సాగి
ఎదననంతా తడిపేస్తాయి
అశక్తంగా…
జాలిగా…
అణువణువునూ రగిలిస్తూ…
నా కళ్ళముందు
ప్రేమ మైకంలో
ఎన్నో జీవితాలు గిడసబారి పోయాయి
ప్రేమ…
ఎంత అందమైన భావన
జాతి – మతం,
ఆస్తి – అంతస్తు,
తారతమ్యాలంటూ ఎరగదు
సమభావన ప్రేమ
క్రమశిక్షణ ప్రేమ
ద్వేషం లేనిది ప్రేమ
అనురాగం, కరుణ, మృదుత్వం ప్రేమ
అలాగే…
ప్రేమ ఒక జ్వాల
విరహాల మంటల్లో
మనసును మాడ్చేసి
అనంత దుఃఖాన్ని మిగిల్చేదీ ప్రేమే
అదొక ఆట…
మనసు మనిషితో ఆడుకునే ఆట
ఆశించింది దక్కితేనే గెలుపు
గెలిచిన వారి కంటే
ఓడిన వారే ఎక్కువ
అయినా…
అందరూ ఆ ప్రేమలోనే పడుతున్నారు
కానీ…
ఎంత మందికి స్వచ్చమైన మనసుంది?
ప్రేమికులం అని చెప్పుకునే వారికి
ప్రేమంటే తెలుసా!
ఆకర్షణ, అధికారం,
స్వార్థం, సంకుచితత్వం,
లైంగిక మోహం…
ఇవీ నేటి ప్రేమకు లక్షణాలు
ప్రేమ…
ఉన్నతమైనది,
ఉన్మత్తమైనదీ,
ప్రేమించడం..
ప్రేమించబడటం..
రెండూ అర్హతలు కావు
ప్రేమలోని గొప్పదనం
ప్రేమలోని గాఢత్వం
అనుభవంలోకి రావాలంటే
ప్రేమ విఫలం కావాలి
అప్పుడే ప్రేమ విలువ తెలిసేది
నేటి ప్రేమికుల దురదృష్టం ఏమంటే
వాళ్ళ ప్రేమలు
శరీరాల కలయికతో నిలిచిపోవడం
అనంతమూ అనన్యమూ అయిన ప్రేమలోకంలో
శరీరాల కలయిక ఒక సోపానం మాత్రమే
ఈ కలయిక లేని ప్రేమ
నేడు కోటికొక్కరిలో ఉంటుందేమో!
మిగిలిన వారందరికీ…
శరీర దాహం తీర్చుకోవడమే ప్రేమ!

Read Full Post »

నేను ఒంటరిగా చీకట్లో కూరుకు పోయాను
నీవు నాకు జీవితపు వెలుగును చూపించావు!
ప్రతి విషయాన్ని కాంతిమయం చేస్తూ
నీ చిరు నవ్వుని నాకిచ్చావు!
నేను విచారంగా ఉన్నపుడు
నీవు సంతోషాన్ని మోసుకొస్తావు!
నీ నవ్వుల్ని నాతో పంచుకుని
నా దు:ఖాన్ని దూరం చేస్తావు!
నేస్తమా!
నమ్మకం అంటే అర్థం తెలిసేలా చేశావు
నేను బలహీనంగా ఉన్నపుడు శక్తినిచ్చావు
నేను అపనమ్మకంలో పడినప్పుడు నన్ను ప్రేరేపించావు
ఇప్పుడు!
నేనేమిటో తెలుసుకునేలా చేశావు
నీవు నా కోసం చేసిన వాటికి
కృతఙ్ఞతలు ఎలా తెలుపుకోను?
నా జీవితమంతా హృదయంలో
గుడి కట్టి పూజించడం తప్ప!

Read Full Post »

ఒకనాడు అనుకోకుండా
నా జీవితంలోకి వచ్చావు
నీతోనే జీవితమనుకున్నా
నువ్వు లేనిదే నేను లేననుకున్నా
అన్నీ నీతో పంచుకున్నా
కానీ…
నువ్వు నన్ను మరచిపోయావు
మరెవరికో దగ్గరయ్యావు
నా హృదయమెప్పుడో పగిలి పోయింది
నన్ను చంపుతావెందుకు
ప్రేమ పేరుతో
నువ్వు చేసిన గాయమింకా మానలేదు
ఈ జీవితమింతే అనుకున్న సమయాన
నువ్వు కనిపించావు
పోతున్న ప్రాణం తిరిగొచ్చింది
ఇక జీవితమంతా సంతోషమే అనుకున్నా
నేనెంతగా ఏడ్చానో
నీకు చెప్పాలనుకున్నా
కానీ..!
నువ్వేం చేసావు!
నన్ను మరచి పొమ్మన్నావు
మనిద్దరికి పొసగదని చెప్పావు
సంవత్సరాల తరబడి తిరిగాక
నీకు మరో అందం కనబడే వరకు
నేను తెలుసుకోలేక పోయాను
నువు చెప్పింది విన్నాక
ఇంటికెలా వచ్చానో తెలియదు
గుమ్మం ముందు అమ్మ పలకరించినా
వినిపించుకోలేదు
కంటి ముందు అంతా చీకటి
యేమి చెస్తున్నానో తెలియదు
కానీ…
ఒకటి మాత్రం నిజం
రేపుదయం ఈ లోకమంతా వినిపిస్తుంది
“పాపం ఎవరో ప్రేమ పేరుతో మోసం చేశారంట”.

Read Full Post »

నిన్ను చూసి ఎన్నాళ్ళయిందో
నన్ను నేను పోగొట్టుకుని అన్నాళ్ళయింది
ఇన్నాళ్ళూ…
నా మనో వీధిలో
దు:ఖ జలధులు పొంగుతూనే ఉన్నాయి
నిజానికి…
ఎన్నో దినాలు వచ్చి వెళ్ళాయి
నేను మాత్రం
నిన్ను చూసిన క్షణంలోనే ఉండిపోయాను
నేను నేనుగా లేను
నీ తొలి చూపు సోకి
మనసు మల్లె పందిరయ్యింది
నీ చెరగని చిరునవ్వు
గుందెల్లో గులాబీలు పూయిస్తుంటే
అక్షర యుద్ధం చేసే కవి సామ్రాట్టునయ్యాను
కవన కౌతుకమై గిరికీలు కొడుతున్నాను
కూని రాగాల కూనలమ్మనయ్యాను
అందుకే అంటున్నాను…
నేను నేనుగా లేను…
నూతనోత్సాహం అణువణువునా నింపుకుని
తటిల్లున మెరిసే మెరుపునయ్యాను
నీలి గగనాన కారు మేఘ మాలికలతో
సరసాలడే చందమామనయ్యాను
నేను నేనుగా లేను…
ఆ క్షణమే నేను నువ్వయ్యాను

Read Full Post »

ప్రియతమా!
నన్ను నీ వెంట పడేలా చేసి
నీవు మరో మజిలీలో పయనిస్తున్నావు
నీ కోసం అణువణునూ
ఆలోచన లేని కాలంలా ఆరా తీస్తుంటే
నన్నిలా మభ్య పరచడం భావ్యమా!
నా ప్రేమను ఎప్పటికైనా తెలుసుకుంటావని
అనుకున్న సందర్భాలెన్నో
నా స్నేహితులు నన్ను కలిసినప్పుడు
ఎందుకదోలా ఉన్నావు? అన్నా..
ఎందుకంత సంతోషం! అన్నా..
ఎందుకీ మౌనం! అన్నా..
అన్నిటికీ నా సమాధానం
నా ప్రేయసి..!

Read Full Post »

నువు వినగలిగితే
నా గుండె శబ్దాన్ని విను
అది ఏడుస్తోందని
నీకు మాత్రమే తెలుస్తుంది
నువు చూడగలిగితే
నా అంతరాత్మలోకి తొంగి చూడు
నువు లేని ఆత్మ
మండిపోతూ కనిపిస్తుంది
నువు చదవగలిగితే
నా తలలోకి దూరిపో
నేనెంతగా నిన్ను
కోల్పోయానో తెలుస్తుంది
నువు నా నాడులలో
ఉరకలెత్తే రక్తాన్ని చూస్తే
అది ఎవరి కోసం
తాపత్రయ పడుతోందో తెలుస్తుంది.
నువు నా కళ్ళల్లోకి చూస్తే
వాటి వెనక విశాదం కనిపిస్తుంది
ఆ విశాదానికి కారణమైన నీవు
నాకు అందనంత దూరం లో ఉన్నావు.

Read Full Post »

ఈ లోకం చూడర భయ్యా
బహు చిత్రమైందిరా భయ్యా

చట్టాన్నే చూడరా భయ్యా
కాసులకది చుట్టం రా భయ్యా
కాసులున్నోడికేరా భయ్యా
లోకం దాసోహం రా భయ్యా

న్యాయానికిరా భయ్యా
నిలువ నీడేదిరా భయ్యా
అక్రమార్కుల చేతిలో భయ్యా
అగచాట్లు పడుతోందిరా భయ్యా

రూపు బహు రూపురా భయ్యా
గుణం గుడిసేటిదిరా భయ్యా
అనే మాట వినలేదా భయ్యా
కొందరెన్నారైల పట్ల నిజం రా భయ్యా

కట్న కానుకల కోసం భయ్యా
ఆలిని చంపుతున్నరు భయ్యా
మనిషన్న మాటకు భయ్యా
అర్థమన్నదే లేదురా భయ్యా

చదువులేమొరా భయ్యా
ఇంజనీరు, డాక్టరు భయ్యా
ఇంత చదువైనా భయ్యా
ఇంగితమన్నది లేదురా భయ్యా

యువతరం చూడర భయ్యా
ప్రేమంటూ తిరుగుతున్నరు భయ్యా
ప్రేమించలేదనిరా భయ్యా
పిల్లనే చంపుతున్నరు భయ్యా

అభిమానులంటరా భయ్యా
అది హద్దులు మీరెరా భయ్యా
తప్పును కప్పెడుతూ భయ్యా
హర్తాళ్ళే చేస్తున్నరు భయ్యా

అన్యాయం జరిగితే భయ్యా
అయిపు లేక పోతున్నరు భయ్యా
అంతా అయినాక భయ్యా
ఆక్రోశిస్తున్నరు భయ్యా

రాజకీయమే చూడరా భయ్యా
అది క్షుద్రమాయెరా భయ్యా
ఉద్యమాలనే చూడరా భయ్యా
ఉరికొయ్యలుగా మారెరా భయ్యా

నాయకులనే చూడరా భయ్యా
అనామకులవుతున్నరు భయ్యా
ఉపన్యాసాలతో భయ్యా
ఊపిరి తీస్తున్నరు భయ్యా

రెచ్చగొట్టే నాయకులను భయ్యా
రెచ్చిపోయి తరమాలిరా భయ్యా
ఊపిరున్నంత కాలం రా భయ్యా
ఉగ్రులై తరమాలిరా భయ్యా

రాజకీయ చదరంగంలో భయ్యా
రణరంగపు సమిధవకురా భయ్యా
ఇకనైనా కళ్ళు తెరవరా భయ్యా
ఇల నిజం తెలుసుకోరా భయ్యా

Read Full Post »

సంధ్యా!
నీ దేహ పరిష్వంగం లో ఒదిగి పోవాలని
అనాదిగా ఎదురు చూస్తున్నా
ఆ మహోన్నత సమయం కోసం
సమస్త ప్రకృతి నా వేపే చూస్తోంది
సువిశాల శూన్యం లో
మన దారులు సమాంతర రేఖలేనేమో!
నేనొక అగ్ని శిఖనని
ఏ అనుభూతులూ అఖ్ఖర్లేదని గర్వం
అందుకే కదూ ఒంటరినయ్యాను
ఇదంతా నీ గురించి తెలియక ముందు
తొలిసారి నీ గురించి విన్నాక
మన్సులో తెలియని అలజడి.
ప్రతి రోజు అందంగా ముస్తబై
నిన్ను చూడాలని వస్తున్నా
నీ జాడ తెలియక మండి పడుతూ
తూరుపునుండి పశ్చిమానికి వెతుకుతున్నా!
నా గమనం లో…
ఎందరో నన్నాడిపోసుకుంటున్నారు
కాల్చేస్తున్నానని, మాడ్చేస్తున్నానని
నేనేం చేయను సంధ్యా?
నీ విరహంలో నేనొక సమిధను
నేనెట్లా కాల్చను…
స్వయంగా నేనే కాలిపోతుంటే!
నువు నాకంటే ముందుగా
నా దారిలోనే వెలుతున్నావని తెలిసింది
అయినా నిన్ను చేరలేకున్నాను
నువ్వెలా ఉంటావో చూసిరమ్మని
చందురున్ని పంపా
నీ అందం చూసి గులామై
నీ నుదుట సింధూరమయ్యాడని
తరవాత తెలిసింది
నా శరీరాన్ని ముక్కలుగా చేసి
చుక్కలుగా పంపా…
మోసం చేసి..
నీ చెక్కిట కెంపులయ్యాయి
వాయువుని పంపా..
నీ సమాచారం చెప్పమని…
సమస్త ప్రాణికి ఆహ్లాదం పంచుతున్నాడంట నీతో కలిసి
వరుణిన్ని పంపా నిన్ను ముద్దగా తడపమని
అపుడైనా చలికి వణుకుతూ…
నా బాహువుల్లో ఒదిగిపోతావని
శూన్యం నుండి రాలే ప్రతి చినుకునూ
నిన్ను చేరనివ్వడం లేదు భూదేవి.

కొండా కోనా
చెట్టూ పుట్టా
పశు పక్షి…మనుషులు
సమస్త లోకమూ
నీ రాకకై ఎదురు చూస్తున్నాయట
సేద తీరుస్తావని
ఎందరికో ఆత్మీయమైన నీ రాక
నాకు మాత్రమే కరువయ్యిందేం..?

ఎడబాటు…
ఎందరో కవులు ప్రభందాల్లో
ఎంతో అందంగా వర్ణించారు
యావత్ప్రపంచంలోని
సమస్త వస్తు గుణాలతో పోల్చారు
విరహం…
కాల్చేస్తుందనీ…
మాడ్చేస్తుందనీ…
స్వయంజలితమైన నేను
అనుభవిస్తున్న విరహాన్ని
ఏ మాటలతో వర్ణించను సంధ్యా!
కాల్చడం, మాడ్చడం వంటి మాటలు చాలవు
సప్త లోకాల్లోని భాషల్ని వెతికినా
నేననుభవించే విరహాన్ని వివరించే పదాలు లేవు

ఎదురు చూపుల్లో…
ఎంతో ఆనందం ఉంటుందంటారు
నీ ఎదురు చూపుల్లో నాకెందుకింత విషాదం
పదే పదే…
నీవు సంచరిచే దారుల్లో వేచి ఉంటానా!
అక్కడేమున్నాయని?
నువ్వు లేవు నవ్వుల్లేవు
మనసు లేదు మమతల్లేవు
చూపుల్లేవు ప్రేమల్లేవు
అంతా విషాదమే…
అయినా నీ కోసమే నా నిరీక్షణ

వసంత కాలం లో ఆమని కోయిల
ఎంత ఆనదంగా గీతాల్నాలపిస్తోంది
నా విరహాగ్నిని ఏ మాత్రం చల్లార్చలేని
అ గీతాల్ని ఎలా ఆస్వాదించను
కళ్ళన్నీ దు:ఖ జలధులై వర్శిస్తుంటే
ఓదార్పునిచ్చే తోడు లేని జీవితంతో
ఎంత కాలమీ పోరాటం?

సూర్యున్ని ఆర్పేసి
పడమటింటి గూట్లో
వెన్నెలదీపాన్ని వెలిగిస్తోంది దినం
అష్ట దిక్కులేకమై
ఎందుకని దినాన్ని ప్రశ్నిస్తే
నా సంధ్య కోసమంది
దినం దీపం వెలిగించే వేళ
పడమటి కనుమల్లో
కుంగిపోతున్న నన్ను
పక్షులు పలకరిస్తే
గొంతు పెగల లేదు
నిప్పులు చెరిగే నీలో కన్నీళ్ళా అని
పక్షులు చెప్పేవరకు తెలీదు
నాలోనూ హిమనదాలున్నాయని

సంధ్యా!
నీవు లేని నేను లేనని తెలుసు నీకెపుడో
తెలిసి నేను నిన్ను చేరినా
తెలియక నే పడిన వెతలెన్నో
తెలియని అఙ్ఞానాంధకారంలో
అలసి సొలసి నేను తిరుగుతుంటే
తెలిసీ తెలియనట్లు వెన్నంటే ఉంటూ
జాడ తెలియనీకుండా..
బ్రతుకు సమిధలో ఆజ్యం పోస్తున్నావు
నీ ఊహలు నా మది నిండా నింపుకుని
నీ సందిట చేరాలని కలలు కంటూ వచ్చాను
నీవు కనిపించలేదని విలపించానే గాని
నింగి నీ సదనమని, వెన్నెల నీ వదనమని
కళ్ళుండీ చూడలేక పోయాను
నీ చేతిలో చెయ్యేసి
పున్నమి వెన్నెల వెలుగుల్లో
కృష్ణా తీరపు ఇసుక తిన్నెల్లో అడుగులెయ్యాలని
పొంగి పోయనేగాని
పొంగి పొరలే తరంగాలు
నీ మేని పొంగులని
తెలివుండీ తెలుసుకోలేక పోయాను
నీ పలుకు కోసం, నీ చల్లని చూపు కోసం
వీనులను వినువీధిలో పరిచాను
నీ పలుకు కోసం నా గుండె చప్పుడాపుకున్నాను
నీ రాకకై నేలనై పచ్చని తివాసీ పరిచాను
దారి చూపేందుకు నే వెన్నెలనౌదామనుకుంటే
నెల సగమే వెలిగే వెన్నెల కావొద్దని మనసొకటే గోల!
సముద్రమంత సంబరంతో
నీ చంద్ర వదన శోభకు
తరువుల పచ్చదనాన్ని, విరుల తెల్లదనాన్ని
వెన్నెల చల్లదనాన్ని
పారిజాత పరిమళాలతో రంగరించి
మదిలోని భావ తరంగాల్ని
అనురాగ రసాల్లో కలిపి ముద్ద చేసి
నీ సుతి మెత్తని పాదాలకు పారాణి పూయాలని
నీ పలకరింపుతో పులకరించాలని
నీ ఎద సందిట పరవశించాలని
నా తనువంతా కళ్ళుగా నిరీక్షిస్తున్నా…

Read Full Post »

1
నువు చూసింది ఒక క్షణమే
ఆ క్షణం నాలో కలిగిన స్పందన
ఈ జీవితానికి సరిపోయేంత
అనంతమైన ఎడబాటు తరువాత
నిన్ను చూసిన ఆనందం..
ఎలా వర్ణించను..

2
నా హృదయాన్ని గుడిగా మలచి
నీ ప్రతి రూపాన్ని దేవతగా నిలిపా
నా రక్త మాంసాలనే నైవేద్యంగా పెట్టా
కనికరమైన లేకుండా కాల రాచి పోతావేం?

3
సఖీ…
నీ తలపులు
నా గుండెను పిండినపుడు
రక్తం కన్నీరై కారుతోంది
కన్నీరు వరదలౌతూనే ఉంది
కాలం కరిగిపోతూనే ఉంది
చెలీ…
నీ వలపు వలలో నను బంధించి
ప్రపంచంలోని తక్కిన ఆనందాలకు…
నన్నతీతున్ని చేసావు.

Read Full Post »

నువ్వు నాతో ఆడుకుంటున్నావో
నేను నీతో ఆడుకుంటున్నానో
అర్థం కావటం లేదు
మనిద్దరి మధ్య ఎప్పుడు ఎలా
ఈ దాగుడు మూతలాట మొదలైందో తెలియదు
ఏ క్షణాన మనిద్దరి మధ్య మాటలన్నీ నిశ్శబ్దమై
సైగల భాషలోకి తర్జుమా అయ్యాయో
అంతకన్నా తెలియదు
ఉషోదయ వేల
అందంగా ముస్తాబై
గుమ్మం దాటే నిన్ను
నా ఇంటి ద్వారాన్నై పరికిస్తున్నప్పుడు
కాలమెంతయ్యిందో తెలీయదు
భోజనానికి రారా అని
అమ్మ కేక విన్నపుడు తెలిసింది
సాయంకాలపు నీ మాయాజాలంలో
మునిగిపోవడానికి మరి కాస్త సమయముందని
సంధ్యా సమయాన
వీధిలోకి, ఇంటిలోకి
నువ్వు చేసే పచార్లు
మధ్యలో నువ్వు విసిరే వాలు చూపులు
కత్తులై నా హృదయాన్ని చీలుస్తాయని
నేనేనాడూ కలగన లేదు
మన మధ్య సరదాగా మొదలైన ఆట
నన్నో పనికిమాలిన వాడిగా మారుస్తుందని
నాకేం తెలుసు..
నీ నవ్వుల్లో ఏ పువ్వులున్నాయో
వాటి పరిమళాలు మాత్రం
నా నరాల్ని తెంచుతున్నాయి
నిన్ను చూసినప్పుడల్లా
నా కను పాపలు విచ్చుకుంటాయి
అడుగులు తడబడతాయి
హృదయస్పందన పదింతలవుతుంది
గొంతు పెగలదు..
నువ్వెప్పుడూ ఒక తెగని కనికట్టు
నీ మేని సుగంధాలొక
ఎనస్తీషియాలా..
నన్ను నిశ్చలున్ని చేస్తూనె ఉన్నాయి
ఇప్పటిదాకా..
నాతో నువ్వాడిందంతా దొంగాటా..
చీకట్లు ముసురుకుంటున్నా
వసార్లోని పడక్కుర్చీనొదలక
చదువుకుంటున్నానని మీ వాళ్ళని మభ్యపరుస్తూ
మా ఇంటి గుమ్మానికేసి నీ చూపులు విసురుతూ
ఏ మాయ చేసావో నీకే ఎరుక
అదుగో…
అప్పటి నుండే
నా తనువును తలుపులకు అంకితమిచ్చి
నీ తలపులతో ద్వారన్నాయ్యాను
ఇది దొంగాటా..?

Read Full Post »

« Newer Posts - Older Posts »