నువ్వు నాతో ఆడుకుంటున్నావో
నేను నీతో ఆడుకుంటున్నానో
అర్థం కావటం లేదు
మనిద్దరి మధ్య ఎప్పుడు ఎలా
ఈ దాగుడు మూతలాట మొదలైందో తెలియదు
ఏ క్షణాన మనిద్దరి మధ్య మాటలన్నీ నిశ్శబ్దమై
సైగల భాషలోకి తర్జుమా అయ్యాయో
అంతకన్నా తెలియదు
ఉషోదయ వేల
అందంగా ముస్తాబై
గుమ్మం దాటే నిన్ను
నా ఇంటి ద్వారాన్నై పరికిస్తున్నప్పుడు
కాలమెంతయ్యిందో తెలీయదు
భోజనానికి రారా అని
అమ్మ కేక విన్నపుడు తెలిసింది
సాయంకాలపు నీ మాయాజాలంలో
మునిగిపోవడానికి మరి కాస్త సమయముందని
సంధ్యా సమయాన
వీధిలోకి, ఇంటిలోకి
నువ్వు చేసే పచార్లు
మధ్యలో నువ్వు విసిరే వాలు చూపులు
కత్తులై నా హృదయాన్ని చీలుస్తాయని
నేనేనాడూ కలగన లేదు
మన మధ్య సరదాగా మొదలైన ఆట
నన్నో పనికిమాలిన వాడిగా మారుస్తుందని
నాకేం తెలుసు..
నీ నవ్వుల్లో ఏ పువ్వులున్నాయో
వాటి పరిమళాలు మాత్రం
నా నరాల్ని తెంచుతున్నాయి
నిన్ను చూసినప్పుడల్లా
నా కను పాపలు విచ్చ్కుంటాయి
అడుగులు తడబడతాయి
హృదయస్పందన పదింతలవుతుంది
గొంతు పెగలదు..
నువ్వెప్పుడొక తెగని కనికట్టు
నీ మేని సుగంధాలొక
ఎనస్తీషియాలా..
నన్ను నిశ్చలున్ని చేస్తూనె ఉన్నాయి
ఇప్పటిదాకా..
నాతో నువ్వాడిందంతా దొంగాటా..
చీకట్లు ముసురుకుంటున్నా
వసార్లోని పడక్కుర్చీనొదలక
చదువుకుంటున్నాని మీ వాళ్ళని మభ్యపరుస్తూ
మా ఇంటి గుమ్మనికేసి నీ చూపులు విసురుతూ
ఏం మాయ చేసావో నీకే ఎరుక
అదుగో…
అప్పటి నుండే
నా తనువును తలుపులకు అంకితమిచ్చి
నీ తలపులతో ద్వారన్నాయ్యాను
ఇది దొంగాటా..?
ఇది దొంగాట కానేకాదు…..బాగుంది!