FROM MY HEART

పొనగంటి కవిత్వం

అలల కౌగిలి అక్టోబర్ 4, 2009

tsunami-dust-wave

ఎంత చల్లని వేకువ
నలు దిశలూ మేలుకుని
కనులు తెరిచి పరికిస్తున్నై
తూరుపు దిక్కున అపుడే
విచుకుంటున్న సూర్య కమలం
ప్రశాంతమైన సముద్ర తీరం
మార్నింగ్ వాక్ లూ, పుణ్య స్నానాలు
పసి హృదయాల ఆటపాటలు
సందడే సందడి..
నెలవంక లేత వన్నెల్ని
చిన్న భిన్నం చేస్తూ
మబ్బు విరుపుల్లో దిన రాజు
ఇంతలేసి కన్నులతో ఏం చూస్తున్నాడో!
ఇంతలో…
తూరుపు గొంతులో హా హాకారాలు
దక్షిణ దిక్కున గుండెలు పగిలే ఆక్రందనలు
ఉప్పెనో, ఉత్పాతమో..
కడలి గర్భాన రేగిందో కలకలం..
అవనీతలాన్ని అతలకుతలం చేసింది.

సముద్రుడా..!
నిర్దయా ముద్రుడా..!
సుప్రభాత వెలుగు రేఖల్లో
ఉల్లాసంగ, ఉత్సాహంగా నీ దగ్గరకొస్తే..
ఎగసి పడుతున్న నిన్ను చూసి
‘ పున్నమి ‘ ఉత్సాహమనుకున్నా
మరునిమిషంలో…
మరుభూమిగ మార్చే హెచ్చరికలని
ఊపిరితో మిగిలాక గానీ తెలుసుకోలేకపోయా!
ఎంత చిత్రం..!
పుణ్యం పంచుతావనొస్తే
అలల పాశాలు విసిరి అసువులు దీసావు
భూదేవి కంపించిందని
భూత దయ మాని భూతమై వెంటాడావు
కెరటాల విస్ఫు లింగాలను వెదజల్లి
ఊళ్ళనే తుడిచి పెట్టావు
నలుదిక్కులా…
నిట్ట నిలువై లేచి
నీ కబంధ హస్తాల్ని విసిరి
స్వైర విహారం చేస్తూ
ఉత్తుంగ తరంగమై కుత్తుకలుత్తరించావు
నీ శక్తిని చూసి..
దక్షాధ్వరంలో..
పరాశక్తి సైతం నిస్సహాయగా నిలిచింది

ఇంకా కోలుకోనే లేదు
మళ్ళీ వచ్చావా!
ఆ గాయాలింకా మాననే లేదు
కొత్తగాయాలనెలా భరించేది?
అప్పటి నీ నామ ధేయం సునామీ
ఇప్పుడేమని పిలవాలి.

మంత్రాలయంలో రాఘవేంద్రుని సాక్షిగా
ఊపిరి వదిలిన నా సోదరుల ఉసురు
నీకు తప్పకుండా తగులుతుంది
అదేం ఖర్మో..
పుణ్యం కోసం పోయిన ప్రతిసారీ
అసువులు దీస్తున్నావు.

నిన్న మొన్నటి వరకు
నీ ఒడిలో ఆడుకోనిచ్చావు
అంతలోనే..
నీ కడుపులో చేర్చుకున్నావు
నీ కిది న్యాయమా క్రిష్ణమ్మా!

మా దేశంలో స్వాములూ, బబాలు కోకొల్లలు
దైవాంశ సంభూతులం,
దేవ ధూతలం అంటారు..
అనంతం లో పుట్టిన ఏ దే వుడూ
నీ విలయ తాండవం గురించి చెప్పడు
గుట్టు విప్పుతాను గుండెలో పెట్టుకో
అవసరానికి అందరూ దొంగలే..
స్కాముల స్వాములే..
అనర్థం జరిగిపోయాక
సభలు పెట్టి మరీ చింతించే రకం
అన్నట్లు చెపాటం మరిచా!
మా నాయకులూ మరీనూ!
అధికారముంటె ఓ తరహా
లేకుంటే మరో తరహా
ప్రకృతి మాపైఅ కన్నెర్ర చేస్తే
మా నాయకులొకరినొకరు దూషించుకుంటారు
శవ రాజకీయాలతో శివ తాండవం చేస్తారు
జోలె పట్టుకుని తిరిపెమెత్తుతారు
వీధికో నాయకుడు పుట్టుకొస్తాడు
వీళ్ళంతా మా కన్నీళ్ళు తుడుస్తారని
ఆశగా ఎదురు చూస్తూ
అనాదిగా మోసపోతూనే ఉన్నాము
గుప్పెడు మెతుకులు
మా గొంతులో నింపుకోవడానికి
ఉగ్గబట్టుకున్న జవ జీవాల్ని కూడదీసుకుంటూ
జీవన సమరానికి సమాయాత్తమవుతాము.

 

Leave a Reply