
మరో పసి మొగ్గ నేల రాలింది
పంట కాల్వలో శవమై తేలింది
చేయని నేరానికి బలై పోయింది
వీధి వీధికో చరిత్ర
వీధి లోని అనాధలదో చరిత్ర
విసిరేసిన మెతుకులే పంచభక్ష్య పరమాన్నాలుగా
కటిక నేలనే పట్టు పరుపులుగా
పవలించే అభాగ్యులు…
అడుగడుగునా అన్నార్తులు…
ఎక్కడి నుండి వచ్చారు?
ఆకాశం నుండి ఊడి పడ్డారా?
భూగర్భం నుండి పుట్టుకొచ్చారా?
లేదే!
మదమెక్కిన కామాంధుల
క్షణిక సుఖంలోంచి పుట్టుకొచ్చారు!
రహదారుల కూడళ్ళలో రమించుకునే పశువుల్లా
చీకటి పరదాల మాటున వస్త్రాల్ని వొలుచుకునే యువత
ప్రేమ పేరుతో ఆత్మ వంచన చేసుకుంటూ
తలకెక్కిన మైధునపు నిషాలో
ఒళ్ళు మరచి కైనీడల్లో ఆడుకునే
రాసక్రీడల్లోంచి పుట్టుకొచ్చారు
యుక్తవయసు రాగానే అమ్మాయిల వెంట పడే పోకిరీలు
మాయ మాటలు చెప్పి అతివల్ని గర్భవతుల్ని చేస్తున్నారు
మోసగించబడిన వనిత ఏటికి ఎదురీదినట్లు
మానవత మృగ్యమై పోయిన జనారణ్యంలో
రాబందుల్లా పొడుచుకు తినే సమాజంతో
ఒంటరి పోరాటం సాగించ లేక
నమ్మిన వాడు నట్టేట ముంచినప్పుడు
కన్నవారి కరుణకు నోచుకో లేక
ప్రపంచమంత ఎదిగిన పాపాల్ని పిండాలుగా
తమ గర్భంలో మోస్తున్నారు
క్షణిక ఆకర్షణకే ప్రేమ అనే పేరు పెట్టుకుని
కసాయి వాడిన నమ్మిన గొర్రెల్లా..
నయ వంచకుల వెంట నడుస్తున్నారు.
ఆడ జన్మకు పరమార్థం మాతృత్వం అంటారు
అమ్మా అనే పిలుపులో
ఆనందం చవి చూస్తుందంటారు
అల్లంటిది…
పేగు తెంచుకు పుట్టిన బిడ్డ
పంట కాల్వ పాలయ్యాడని
పరితపించే ఆ తల్లి హృదయ ఘోష
మీ చెవులకు సోకలేదా?
ఏ కర్కశ హృదయం కాల రాచిందో
కన్న తల్లికి కడుపు కోత మిగిలింది
పురిటి పొత్తిళ్ళలో
అమ్మ ఒడి వెచ్చదనాన్ని ఆస్వాదిస్తూ
కేరింతలు కొట్టాల్సిన పసికూన
నేల తల్లి ఒడిలో..
సూర్యుని వెచ్చదనానికి..
లోకపు పాపపు పోకడలు తెలీక
మాయా మాలిన్యాలు చూడలేక
అమాయకంగా,
శాశ్వతంగా నిద్రిస్తోంది
గడప దాటిన ఆడది
పుట్టింటికి తిరిగి రాలేక
కట్టుబాట్లు కాల రాచిందని
కాకుల్లా పొడుచుకు తినే ఇరుగు పొరుగు
నమ్మిన వాడు నట్టేట ముంచి పోయాడనే
బాధల మధ్య
సమాజంతో సమరం సాగించలేక
వేశ్యా గృహాల కో..
ఆరడుగుల నేలకో..
తమ జీవితాలను అంకితం చేస్తున్నారు.

