
అమెను ప్రేమిస్తున్నావా? అంటే
అవును, అహర్నిషలు అంటాను
మరి దేవున్ని అనడిగితే
లేదు, అందుకు సమయం ఎక్కడుంది! అంటాను
నువు నాకు తెలిసిన నాటి నుంచి
నీకే అంకితమై, అనింటికీ దూరమయ్యాను
కళ్ళు మూతలు పడుతున్నవి
చుక్కలు మిణుకు మిణుకుమంటున్నవి
నీలో ఏ మార్పూ లేదు…
భవంతుల తలుపులు బిగించి
నిద్రకు ఉపక్రమిచే వేళ
మంచు వెన్నెల్లో
నీ తలపులతో తపిస్తూ చూస్తున్నాను
రెప్ప పాటులో
తలుపు తెరుచుకుని నీవొస్తావు
నేను చూపుగా మారి నిన్నల్లుకుంటాను
సంధ్య సమీరాన్నై
నిన్ను స్పృశిస్తాను
నిన్నల్లుకున్న చూపుకో
స్పృశించిన సమీరానికో
ఒడలంతా నిగడ దీసుకున్న
నువ్వొక హిమవన్నగ శృంగారానివి
నువ్వంటే నాకెప్పుడూ పిచ్చే.
నీ కోసం..
రేయింబవళ్ళ పరిభ్రమణంలో
సవా లక్ష రూపాలెత్తిన వాణ్ని
సందేళ..
మచు దీపాన్నై
నీకు వెండి వెలుగుల హారతిస్తున్నాను,
చంద్ర కిరణమై నిన్ను స్పృశిస్తున్నాను,
నీ కురుల మధ్య పొగడ పూవునై
నాట్యాలాడుతున్నాను,
చలి వెలుగు జిలుగు చెరగులతో
నిన్ను ఆలింగించుకుంటున్నాను,
చివరికి నా ఉనికిని గుర్తించి
సిగ్గుల మొగ్గలై రాలిన
రంగు పూల రాశిలో
వసంతమాడిన వాన్ని
నేనిలా ఎప్పుడూ నీ కోసం తపిస్తూ, జపిస్తూ
నీవెప్పుడూ అలా నిర్లిప్తంగా నా వేపు చూస్తూ..
ఇడియట్ ని కదా..!
నీ చూపుల లిపి నాకు అర్థం కాదాయె!
బాగుందండి మీ కవిత…
మరీ అలా పబ్లిక్ గా నిజాలు చెప్పేస్తే ఎలా చెప్పండి!!
Thank you very much. కొన్ని సార్లు తప్పదు కదండి. అయినా ఇడియట్ అన్నంత మాత్రాన అదేదో తిట్టు అనుకుంటే ఎలాగండి. నిఘంటువుల ప్రకారం దాని అర్థమ్ పనికిమాలిన వాడు అని కదా! కాబట్టి నా ఉద్దేశ్యమ్ ఏమిటంటే ప్రేమలో పఢిన వాఢు ఎప్పుఢూ పనికి మాలిన వాఢని.
పొనగంటి వారికి ,మీ “ఇడియట్”… భావం భవ్యం. అక్కడక్కడాఅచ్చు తప్పుల విన్యాసం తప్ప. “ఒడ్లంతా”, “వాన్ని” అన్న పదాలు సరిదిద్దండి. రచనలోని మిగతా పదాలకు అనుగుణంగా లేవని నా భావన. కవనా భంగిమ బాగుంది. “ఆలింగించుకుంటున్నాను” సరి క్రొత్త ప్రయోగం లా అనిపించింది.
నీ చూపుల లిపి నాకు అర్థం కాదాయె,…చక్కని ప్రయోగం
అభినందనలు……శ్రేయోభిలాషి …..నూతక్కి
నూతక్కి గారు మీరు సూచించిన సలహాలను దృష్టిలో ఉంచుకుంటాను.మరల ఇటువంటి తప్పులు జరగకుండా జాగ్రత్త పడతాను. మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి అభిప్రాయములను తెలిపినందుకు సర్వదా కృతఙ్ఞతలు. “ఆలింగించుకుంటున్నాను” ఈ పదం నేను సృష్టించినది కాదు. ఇంతకు ముందు చాలా మంది ప్రయోగించారు. నేను నా సౌలభ్యానుగునంగా వాడుకున్నాను.
Dear bhaskar Ponaganti,
very happy to see your repply.wish you and your family members a happy deepaavali…….cardially Nutakki