FROM MY HEART

పొనగంటి కవిత్వం

మినీ కవితలు అక్టోబర్ 28, 2008

ప్రచురించిన వర్గము Poetry — Bhaskar Ponaganti @ 07:11
Tags: , , , ,

కురుక్షేత్రం…
బంధు జన సోదర సమేత
రుధిర ధారా ప్రయుక్త క్షేత్రం.

జనాభా…
మనుషులు, పెద్ద మనుషులు
ఉప్పు కప్పురం పోలికలో.

జీవితం…
ఆదీ అంతం లేని కాలం ముంగిట
ప్రదర్శనకొచ్చిన నగ్న సత్యం.

మృత్యువు…
పొంచి ఉన్న శూన్యం చేతిలోని
కరవాలంపై అంటుకున్న నెత్తుటి చార.

 

నిర్లిప్తత అక్టోబర్ 28, 2008

ప్రచురించిన వర్గము Poetry — Bhaskar Ponaganti @ 06:00
Tags: ,

ఒకప్పుడు..
అంతులేని విశ్వాసం ఉండేది నాలో
గట్టు తెగిన గోదారిలంటి ఆవేశం ఉండేది
అపూడు నాకు తెలియదు
అదంతా నా వయసు తొందరని
ఆలోచించనివ్వని ఆవేశం
అనుకోని ఇక్కట్లలోకి తోసింది
ఆవేశం
మనిషి ఆలోచనల్ని బందిస్తుందని తెలుసుకునే సరికి
సగం జీవితం ఖర్చయి పోయింది

వేకువకి వేకువకీ మధ్య ఎన్ని ఆశలో
అవన్నీ అనుభవంలోకి రాకుండానే గడుస్తోంది కాలం
నిశ్శబ్దంగా జారుకుంటోంది కాలం
కానీ…
నా ఆలోచనలకు పొంతన లేదు
నా ఆవేశానికి అర్ధం లేదు
రాత్రి గడుస్తోందటే చాలు
ఉదయం గురించి భయం
భుజాన పడ్డ బాధ్యతలని నెరవేర్చే తపనలో
కాలేకడుపును అర చేత పట్టుకుని
అవసరాలు తీర్చే సౌకర్యాల కోసం పరుగెడుతున్నాను
యుద్ధం…
చావు బ్రతుకుల మధ్య యుద్ధం
నిలకడ కోసం చేసే ప్రయత్నం ఫలిచడం లేదు
ఓటమి అంచుల్లో స్వాభిమానం ఇంటికి రానివ్వదు
ఉన్నచోట ఉనికికి ఊతం లేదు
కాళ్ళరిగేలా తిరిగే క్షణాన నన్నావహిస్తున్నారు
అరిషడ్వర్గాలకావల మీ ఉనికి
సప్త వ్యసనాలకీవల మీ స్తబ్దత
అనుకుంటూ…
బ్లాక్ మార్కెట్ల నుంచి
దోపిడీ బజారుల నుంచి
అడ్డ దారుల్లో మనుగడకై
అర్రులు చాచేలా చేస్తున్నారు.

 

ఊహా లోకంలో నాయికవు అక్టోబర్ 28, 2008

ప్రచురించిన వర్గము Poetry — Bhaskar Ponaganti @ 05:28
Tags: ,

ప్రియతమా!
నా ఆశల ఆకాశంలో ఇంద్రధనసు నీవు
నా ఊహా లోకంలో నాయికవు నీవు
నీ తలపు తన్మయమై
నీ వలపు వెన్నెలై
నీ పిలుపు వేణుగానమై
నా గుండెల్లో పలుకుతోంది