FROM MY HEART

పొనగంటి కవిత్వం

సూర్యునికి ప్రేమలేఖ అక్టోబర్ 27, 2008

ప్రచురించిన వర్గము Poetry — Bhaskar Ponaganti @ 10:14
Tags: , , ,

crbs0030075

ఏ రోజైన ఏ మాసమైనా

ఆటను వెళ్ళిన తరువాతే

తను వస్తుందని తెలియని సంధ్య

సూర్యునికి ప్రేమలేఖలు వ్రాసి వ్రాసి

గడ్డి పరకల మీద కన్నీటి బొట్లు రాల్చి వెల్లిపోతుందట

 

ప్రజాస్వామ్యం! అక్టోబర్ 27, 2008

మళ్ళీ అదే తతంగం
ప్రతి ఐదేళ్ళకొసారి జరిగేదే!
ప్రజాస్వామ్యమిది!
ప్రజా ప్రతినిధుల దేశమిది!
శతాబ్దాలను దాటుకుంటూ
నవ శకంలోకి అడుగెడుతున్నా
మన బ్రతుకులు మాత్రం మారడం లేదు
స్వార్ధంపెరిగిన నాయకులు
మాటల గారడీలు చేస్తూ
మూటలు పెంచుకుంటూనే ఉన్నారు
ఇది ప్రజాస్వామ్యం!
ఇక్కడంతా చట్ట బద్దమే
దోపిడీ.. దౌర్జన్యం…
ఏదైనా సమ్మతమే…
ఆధికారమనే ముసుగులో
అందినంతా దోచుకోవచ్చు.

అధికార దాహంతో
అమాయకుల నెత్తిన స్వారీ చేయడానికి
సూటి పోటి మాటలతో
ఆరోపణల బురద చల్లుకుంటూ
ఝండాలు పట్టుకుని
మళ్ళీ మన ముందుకొస్తున్నారు
ఏ పార్టీ అధికారంలో ఉన్నా
ఆరోపణల్లో తేడా మాత్రం సున్నా
జనాకర్షన కోసం పార్టీలు
మ్యానిఫెస్టోల పేరుతో
మెదళ్ళకు పదును పెడుతూ
పన్నుల మీద పన్నులు వేసి
జనం నడుం విరుస్తున్నారు.

ఆర్ధిక పరిస్తితి మెరుగు పడుతున్నా
ప్రగతి మాత్రం బండి సున్నా!
ఖజానా ఖాళీ అంటూ…
బొక్కసాలు నింపుకునే బడా చోరులు 
ఆస్తులపై అంతస్తులు నిర్మించుకుంటున్నారు
నేతలు మారినా రాతలు మారని జనం
పస్తులతో చస్తున్నారు
కట్టుకోను మొల నూలు లేకున్నా
ఖద్దరును చూసి మోస పోతూనే ఉన్నారు
గద్దెనెక్కడానికి నేతలు
ఉచితానుచితాలు మరచి
ఉచితమంటూ ఆశలు కల్పించి
గెలిచాక మొండి చెయ్యి చూపిస్తున్నారు .

అమాయకులు అన్నార్తులై వేసే ఆకలి కేకలు
ఆసేతు హిమాచల పర్యంతం ప్రతిధ్వనిస్తున్నా
పట్టించుకోని నాయకులు
పూటకో పార్టీ  పెడుతున్నారు
నిబంధనల ప్రకారం మెజారిటీ రాక
చిన్నా చితకా పార్టీలన్ని కలిసి ప్రభుత్వాన్ని నిర్మిస్తూ
వాటాలు కుదరక మధ్యంతర ఎన్నికలకు సిద్ధం అంటున్నాయి

ప్రజాస్వామ్యం…
పెట్టుబడి దారుల చేతుల్లో కీలు బొమ్మై
నాయకుల మధ్య ఉరి పోసుకు చచ్చింది
ప్రతి ఐదేళ్ళకోసారి పుట్టుకొస్తూ
జరుగుతున్న అరాచకాలనీ
అనైతిక చర్యలనీ చూడలేక
మళ్ళీ మళ్ళీ చస్తొంది…
ఎందుకంటే…
ఇది ‘ప్రజాస్వామ్యం!’
“అజ్ఞానుల సమ్మతిపై అసమర్థుల పాలనే ప్రజాస్వామ్యం” కదా!

 

అక్షరం ఒక ఆయుధం అక్టోబర్ 27, 2008

ప్రచురించిన వర్గము Poetry — Bhaskar Ponaganti @ 08:45
Tags: , ,

హ హ హ హ హా…

నేనెప్పుడు  ఇంతగా విరగబడి నవ్వింది లేదు

“ గుమ్మడి కాయల దొంగంటే

భుజాలు తడుముకున్న” చందాన

బాడుగ నేతల బతుకు విప్పినందుకు

బడుగు నేతలు బజారుకెక్కారు

‘మా అక్షరం మీ ఆయుధం’ అంటె ఏమో అనుకున్న

ఆ అక్షరమే ఆయుధమై

కలాన్ని వేటాడుతుందనుకొలేదు

బడుగుల బతుకు వెతలకు

పాళీ మొన మీద సిరా చుక్కలు

కన్న్నీటి చుక్కలై కారినప్పుడు,

దళిత స్త్రీలపై దౌర్జన్యం చేసి

మూకుమ్మడిగా మానం హరించినప్పుదు

మౌనం వీడని నాయకులు

అక్షరం పై కక్ష బూని

ధర్నాలు చేసారు

స్వజనం అన్యాయమై పోయినా

అయ్యో పాపం అనేవాడు లేడు

 

అక్షరం ఒక ఆయుధం

అవినీతి చెలరేగి

అనంతమై పోతున్నప్పుడు

కలమెప్పుడూ కన్నీరు కారుస్తూనే ఉంది

నిజాల నిగ్గు తేలాలన్నప్పుడు

నిర్భీతిగా గలమెత్త గలిగేది కలమే

కులాల కుమ్ములాటలైనా

మతాల మారణ హోమాలైనా

మదమెక్కిన మందగజాలైనా

అక్షరాయుధమై దునుమాడవచ్చు