సంధ్యా!
నీ దేహ పరిష్వంగం లో ఒదిగి పోవాలని
అనాదిగా ఎదురు చూస్తున్నా
ఆ మహోన్నత సమయం కోసం
సమస్త ప్రకృతి నా వేపే చూస్తోంది
సువిశాల శూన్యం లో
మన దారులు సమాంతర రేఖలేనేమో!
నేనొక అగ్ని శిఖనని
ఏ అనుభూతులూ అఖ్ఖర్లేదని గర్వం
అందుకే కదూ ఒంటరినయ్యాను
ఇదంతా నీ గురించి తెలియక ముందు
తొలిసారి నీ గురించి విన్నాక
మన్సులో తెలియని అలజడి.
ప్రతి రోజు అందంగా ముస్తబై
నిన్ను చూడాలని వస్తున్నా
నీ జాడ తెలియక మంది పడుతూ
తూరుపునుండి పశ్చిమానికి వెతుకుతున్నా!
నా గమనం లో…
ఎందరో నన్నాడిపోసుకుంటున్నారు
కాల్చేస్తున్నానని, మాడ్చేస్తున్నానని
నేనేం చేయను సంధ్యా?
నీ విరహంలో నేనొక సమిధను
నేనెట్లా కాల్చను…
స్వయంగా నేనే కాలిపోతుంటే!
నువు నాకంటే ముందుగా
నా దారిలోనే వెలుతున్నావని తెలిసింది
అయినా నిన్ను చేరలేకున్నాను
నువ్వెలా ఉంటావో చూసిరమ్మని
చందురున్ని పంపా
నీ అందం చూసి గులామై
నీ నుదుట సింధూరమయ్యాడని
తరవాత తెలిసింది
నా శరీరాన్ని ముక్కలుగా చేసి
చుక్కలుగా పంపా…
మోసం చేసి..
నీ చెక్కిట కెంపులయ్యాయి
వాయువుని పంపా..
నీ సమాచారం చెప్పమని…
సమస్త ప్రాణికి ఆహ్లాదం పంచుతున్నాడంట నీతో కలిసి
వరుణిన్ని పంపా నిన్ను ముద్దగా తడపమని
అపుడైనా చలికి వణుకుతూ…
నా బాహువుల్లో ఒదిగిపోతావని
శూన్యం నుండి రాలే ప్రతి చినుకునూ
నిన్ను చేరనివ్వడం లేదు భూదేవి.
కొండా కోనా
చెట్టూ పుట్టా
పశు పక్షి…మనుషులు
సమస్త లోకమూ
నీ రాకకై ఎదురు చూస్తున్నాయట
సేద తీరుస్తావని
ఎందరికో ఆత్మీయమైన నీ రాక
నాకు మాత్రమే కరువయ్యిందేం..?
ఎడబాటు…
ఎందరో కవులు ప్రభందాల్లో
ఎంతో అందంగా వర్ణించారు
యావత్ప్రపంచంలోని
సమస్త వస్తు గుణాలతో పోల్చారు
విరహం…
కాల్చేస్తుందనీ…
మాడ్చేస్తుందనీ…
స్వయంజలితమైన నేను
అనుభవిస్తున్న విరహాన్ని
ఏ మాటలతో వర్ణించను సంధ్యా!
కాల్చడం, మాడ్చడం వంటి మాటలు చాలవు
సప్త లోకాల్లోని భాషల్ని వెతికినా
నేననుభవించే విరహాన్ని వివరించే పదాలు లేవు
ఎదురు చూపుల్లో…
ఎంతో ఆనందం ఉంటుందంటారు
నీ ఎదురు చూపుల్లో నాకెందుకింత విషాదం
పదే పదే…
నీవు సంచరిచే దారుల్లో వేచి ఉంటానా!
అక్కడేమున్నాయని?
నువ్వు లేవు నవ్వుల్లేవు
మనసు లేదు మమతల్లేవు
చూపుల్లేవు ప్రేమల్లేవు
అంతా విషాదమే…
అయినా నీ కోసమే నా నిరీక్షణ
వసంత కాలం లో ఆమని కోయిల
ఎంత ఆనదంగా గీతాల్నాలపిస్తోంది
నా విరహాగ్నిని ఏ మాత్రం చల్లార్చలేని
అ గీతాల్ని ఎలా ఆస్వాదించను
కళ్ళన్నీ దు:ఖ జలధులై వర్శిస్తుంటే
ఓదార్పునిచ్చే తోడు లేని జీవితంతో
ఎంత కాలమీ పోరాటం?
సూర్యున్ని ఆర్పేసి
పడమటింటి గూట్లో
వెన్నెలదీపాన్ని వెలిగిస్తోంది దినం
అష్ట దిక్కులేకమై
ఎందుకని దినాన్ని ప్రశ్నిస్తే
నా సంధ్య కోసమంది
దినం దీపం వెలిగించే వేళ
పడమటి కనుమల్లో
కుంగిపోతున్న నన్ను
పక్షులు పలకరిస్తే
గొంతు పెగల లేదు
నిప్పులు చెరిగే నీలో కన్నీళ్ళా అని
పక్షులు చెప్పేవరకు తెలీదు
నాలోనూ హిమనదాలున్నాయని
సంధ్యా!
నీవు లేని నేను లేనని తెలుసు నీకెపుడో
తెలిసి నేను నిన్ను చేరినా
తెలియక నే పడిన వెతలెన్నో
తెలియని అఙ్ఞానాంధకారంలో
అలసి సొలసి నేను తిరుగుతుంటే
తెలిసీ తెలియనట్లు వెన్నంటే ఉంటూ
జాడ తెలియనీకుండా..
బ్రతుకు సమిధలో ఆజ్యం పోస్తున్నావు
నీ ఊహలు నా మది నిండా నింపుకుని
నీ సందిట చేరాలని కలలు కంటూ వచ్చాను
నీవు కనిపించలేదని విలపించానే గాని
నింగి నీ సదనమని, వెన్నెల నీ వదనమని
కళ్ళుండీ చూడలేక పోయాను
నీ చేతిలో చెయ్యేసి
పున్నమి వెన్నెల వెలుగుల్లో
కృష్ణా తీరపు ఇసుక తిన్నెల్లో అడుగులెయ్యాలని
పొంగి పోయనేగాని
పొంగి పొరలే తరంగాలు
నీ మేని పొంగులని
తెలివుండీ తెలుసుకోలేక పోయాను
నీ పలుకు కోసం, నీ చల్లని చూపు కోసం
వీనులను వినువీధిలో పరిచాను
నీ పలుకు కోసం నా గుండె చప్పుడాపుకున్నాను
నీ రాకకై నేలనై పచ్చని తివాసీ పరిచాను
దారి చూపేందుకు నే వెన్నెలనౌదామనుకుంటే
నెల సగమే వెలిగే వెన్నెల కావొద్దని మనసొకటే గోల!
సముద్రమంత సంబరంతో
నీ చంద్ర వదన శోభకు
తరువుల పచ్చదనాన్ని, విరుల తెల్లదనాన్ని
వెన్నెల చల్లదనాన్ని
పారిజాత పరిమళాలతో రంగరించి
మదిలోని భావ తరంగాల్ని
అనురాగ రసాల్లో కలిపి ముద్ద చేసి
నీ సుతి మెత్తని పాదాలకు పారాణి పూయాలని
నీ పలకరింపుతో పులకరించాలని
నీ ఎద సందిట పరవశించాలని
నా తనువంతా కళ్ళుగా నిరీక్షిస్తున్నా…







